న్యూఢిల్లీ : గురువారం హోరాహోరీగా జరిగిన ఢిల్లీ నగర మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీపై విజయం సాధించింది. 256 ఓట్లలో 133 ఓట్లు ఆప్ అభ్యర్థి మహేశ్ ఖిచికి లభించగా, ఆయన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి కిషన్‌లాల్‌కు 130 ఓట్లు లభించాయి. రెండు ఓట్లు చెల్లనివిగా ప్రకటించారు. మేయర్ ఎన్నికల్లో ఓటమితో డిప్యూటీ మేయర్ ఎన్నికల నుంచి బీజేపీ వైదొలగింది. ఫలితంగా, డిప్యూటీ మేయర్ పదవిని ఆప్ అభ్యర్థి రవీందర్ భరద్వాజ్ సొంతం చేసుకున్నారు. ఢిల్లీ శాసన సభ ఎన్నికలు వచ్చే ఏడాది ప్రారంభంలో జరగనున్న తరుణంలో ఈ విజయాలు గొప్ప సంతోషాన్ని ఇచ్చాయని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు, కార్యకర్తలు చెప్పారు. దళితుడు మేయర్ కావడంతో ఆప్ కౌన్సిలర్లు జై భీమ్ అని నినాదాలు చేశారు. ఈ ఎన్నికల్లో తమ కౌన్సిలర్లు 8 మంది క్రాస్ ఓటింగ్ చేసినట్లు ఆప్ ఆరోపించింది. వీరి ఓట్లతోనే బీజేపీ బలం పెరిగిందని పేర్కొంది. ఈ ఓటింగ్‌కు కాంగ్రెస్ కౌన్సిలర్లు (ఏడుగురు) దూరంగా ఉన్నారు.