AAIB Report | జూన్ 12న అహ్మదాబాద్‌లో కూలిపోయిన ఎయిర్ ఇండియా ఏఐ 171 విమాన ప్రమాదం ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదికపై ఎయిర్‌లైన్ పైలెట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ALPA-I) ప్రశ్నలు లేవనెత్తింది. దర్యాప్తు తీరును చూస్తే తప్పు పైలట్ల వైపు మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తోందంటూ తీవ్రంగా స్పందించింది. ఈ భావనను పూర్తిగా తిరస్కరిస్తున్నామని.. నిష్పాక్షిక, వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేయాలని డిమాండ్ చేసింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదిక మీడియా లీక్ కావడంపై విమర్శలు గుప్పించింది. ఏఏఐబీ ప్రాథమిక నివేదికను ఏ బాధ్యతాయుతమైన అధికారి సంతకం, విచక్షణ లేకుండానే మీడియాతో షేర్ చేశారంటూ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది. దర్యాప్తులో పారదర్శకత లోపించిందని ఆరోపించారు. దర్యాప్తు పూర్తిగా గోప్యంగా జరిగిందని, ఇది విశ్వసనీయతను ప్రభావితం చేసిందని.. ప్రజలు సైతం దీన్ని పూర్తిగా నమ్మడం లేదన్నారు.
అర్హత కలిగిన, అనుభవజ్ఞులైన సిబ్బంది, ముఖ్యంగా పైలట్లను ఇప్పటికీ దర్యాప్తు బృందంలో చేర్చడం లేదని పేర్కొంది. వాల్ స్ట్రీట్ జర్నల్‌లో జులై 10న వచ్చిన కథనం ఇంధన నియంత్రణ స్విచ్‌లో లోపాన్ని ప్రస్తావించిందని ప్రకటనలో ఆరోపించింది. ఈ ఇలాంటి పరిస్థితుల్లో అలాంటి సున్నితమైన దర్యాప్తు సమాచారం అంతర్జాతీయ మీడియాకు ఎలా లీక్ అయిందనే ప్రశ్నించింది. పైలట్ల తప్పును చూపేలా దర్యాప్తు ఉందని.. ఈ ధోరణిని స్పష్టంగా తిరస్కరిస్తున్నట్లు తెలిపింది. నిష్పాక్షికమైన, వాస్తవాల ఆధారంగా దర్యాప్తు చేపట్టాలని, జవాబుదారీతనం నిర్ధారించడానికి దర్యాప్తు ప్రక్రియలో కనీసం పరిశీలకులుగా చేర్చాలని అసోసియేషన్ పునరుద్ఘాటించింది. అహ్మదాబాద్ విమాన ప్రమాదం గురించి ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) ప్రాథమిక నివేదిక సమర్పించింది. ఈ నివేదిక ప్రకారం.. జూన్ 12న ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 విమానం (AI 171) అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఎగిరిన మూడు సెకన్ల తర్వాత ఇంధన సరఫరా ఆగిపోయింది. టేకాఫ్ అయిన తర్వాత రెండు ఇంజిన్ల ఇంధన సరఫరా ఆగిపోయిన వెంటనే, విమానం కేవలం 29 సెకన్ల తర్వాత కూలిపోయింది. నివేదిక ప్రకారం.. టేకాఫ్ సమయంలో ఇంధన సరఫరా నిలిపివేయడంతో వెంటనే ఇంజిన్ల వేగం తగ్గడం ప్రారంభమైంది. 213.4 టన్నుల బరువుతో ఎగురుతున్న విమానం కిందకు దిగడం మొదలైంది.
ఈ సమయంలో విమానంలో 54,200 కిలోల ఇంధనం. టేకాఫ్ బరువు సమయంలో 2,13,401 కిలోలు. ఇది గరిష్టంగా అనుమతించదగిన బరువు 2,18,183 కిలోల కంటే తక్కువ. విమానం గరిష్టంగా 180 నాట్ల వేగాన్ని చేరుకుందని.. అదే సమయంలో రెండు ఇంజిన్ల ఇంధన కటాఫ్ స్విచ్‌లు రన్ నుంచి కటాఫ్‌కు మారాయని నివేదిక పేర్కొంది. ఈ రెండు స్విచ్‌ల మధ్య కేవలం ఒక సెకను తేడా ఉన్నది. ఏఏఐబీ కాక్‌పిట్ వాయిస్ రికార్డర్‌ను కూడా విశ్లేషించింది. రికార్డు ప్రకారం.. పైలెట్ల ట్రాక్ రికార్డు కూడా క్లియర్‌గా ఉందని తెలిపారు. ఇద్దరూ మెడికల్‌గా ఫిట్ ఉన్నారు. కావాల్సినంత అనుభవం ఉంది. విమానంపై దాడి జరిగినట్లు ఆధారాలు లేవు. ఫ్యూయల్ స్విచ్‌లో లోపాలు ఉన్నట్లు ఎఫ్ఏఏ అడ్వైజరీ ద్వారా తెలుస్తోంది. ఎయిర్ ఇండియా రెగ్యులర్ ఇన్స్పెక్లన్లు చేయలేదు. విమానం బరువు, బ్యాలెన్స్ పరిమితులకు తగినట్లే ఉంది. ప్రమాదకరమైన వస్తువులు కూడా దాంట్లో లేవు. కాక్‌పిట్ వాయిస్ రికార్డ్‌లో ఇంజిన్ ఎందుకు ఓ పైలట్ మరో పైలట్‌ను ‘మీరు ఎందుకు ఆఫ్ చేశావు’ అడగ్గా.. నేను ‘చేయలేదు’ అని రికార్డయ్యినట్లు సమాచారం. దాంతో సాంకేతిక లోపం వల్లే కాటఫ్ అయ్యిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరు పైలట్లు ఇంజిన్లను తిరిగి ఆన్ చేసేందుకు ప్రయత్నించారని నివేదిక పేర్కొంది.