కాస్గంజ్: ప్రేమ గుడ్డిది అంటుంటారు. ఇది యువత విషయంలో నిజమైనా.. తాము కూడా తక్కువ కామని యూపీలో ఒక ముదురు ప్రేమజంట నిరూపించింది. సాక్షాత్తూ పెళ్లయ్యి 10 మంది పిల్లలున్న వ్యక్తి… పెళ్లయ్యి ఆరుగురు సంతానం ఉన్న మరో మహిళతో కలిసి ప్రేమాయణం సాగించి ఇద్దరూ జంప్ కావడం ఆశ్చర్యమైతే.. ఆ మహిళ తన కుమారుడి కాబోయే అత్త కావడం మరో ట్విస్టు. యూపీలోని కాస్గంజ్లో కూలిపని చేసుకునే వ్యక్తి, ఈ-రిక్షా డ్రైవర్గా చేసే షకీల్ 28 ఏండ్లుగా స్నేహితులు. తన కుమారుడికి అతని కుమార్తెనిచ్చి చేద్దామని షకీల్ అడగడంతో ఆయన కూడా అంగీకరించాడు. జూన్ 17న వివాహం చేద్దామని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో షకీల్, స్నేహితుని భార్య తరచూ మాట్లాడుకునే వారు. ఈ లోగా ఇరు కుటుంబాలకు షాక్ ఇస్తూ జూన్ 3న షకీల్, పెళ్లికుమార్తె తల్లి(35) లేచిపోయారు. 10 మంది సంతానం ఉన్న షకీల్, ఆరుగురు పిల్లలున్న పెండ్లి కుమార్తె తల్లి ఇలా చేయడం చూసి బంధువులు, చుట్టుపక్కల వారు ముక్కున వేలుసుకున్నారు. కాగా, పెండ్లి కుమార్తె తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారిద్దరూ ఈ ముదురు ప్రేమ జంట కోసం గాలిస్తున్నారు.