Hindan Air Base | లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ వద్ద ఉన్న హిండన్ ఎయిర్ బేస్ వద్ద సొరంగం కలకలం సృష్టించింది. 20 అడుగుల ఎత్తులో ఉన్న ఎయిర్‌బేస్ ప్రహరీ గోడకు అంచున 4 అడుగుల లోతు గుంత తీశారు. తవ్వకాలపై స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఎయిర్ బేస్‌కు ఢిల్లీకి కేవలం పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఈ గుంత తవ్వకాలపై ఎయిర్‌ఫోర్స్ అధికారులతో కలిసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఎయిర్‌బేస్ ప్రహారీ వద్ద తవ్విన గుంతను పోలీసులు మట్టితో పూడ్చేశారు. అయితే ఎయిర్‌బేస్‌లోకి చొరబడేందుకు అగంతకులు గుంతను తవ్వి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు అడుగుల లోతులో తవ్విన గుంత ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
హిండన్ ఎయిర్‌బేస్.. భారత వైమానికి దళానికి చెందిన వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ కిందకు వస్తుంది. ఆసియాలోనే అతి పెద్ద ఎయిర్‌బేస్‌లలో ఇది ఒకటి. ఢిల్లీ, పరిసర ప్రాంతాల గగనతలాలను సంరక్షించేందుకు ఇది కీలకంగా పని చేస్తుంది. 2611 దాడుల సమయంలో ఢిల్లీ గగనతలాన్ని సంరక్షించేందుకు ఇక్కడ మిగ్-29 యుద్ధ విమానాలను మోహరించారు.