కోయంబత్తూరు: తమిళనాడులోని కోయంబత్తూరులో ఒక జంట తమ బిడ్డ ప్రాణాలు కాపాడుకోవాలని అల్లాడుతున్నారు. దాతలు ఆదుకోవాలని వేడుకుంటున్నారు. కోయంబత్తూరులోని రమణకుమార్, జనని దంపతుల మూడు నెలల పాప మస్కులర్ డైస్ట్రోఫీ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్నది. ఈ చిన్నారి ప్రాణాలు దక్కాలంటే రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ చేయాలి. జోల్జెన్సాగా పిలిచే ఈ ఇంజెక్షన్‌ను అమెరికా నుంచి తెప్పించాలి.
అయితే అంత ఖరీదైన ఇంజెక్షన్ కొనలేని ఆ దంపతులు తమకు సహాయం చేసి బిడ్డ ప్రాణాలను ఎలాగైనా కాపాడాలంటూ కలెక్టర్, ఇతర అధికారులను కోరుతున్నారు. కాగా, చికిత్సకు అపసరమయ్యే నిధులను సమకూర్చడానికి ‘ఇంపాక్ట్ గురు’ యాప్ ద్వారా ప్రయత్నిస్తున్నారు.
‘స్పైనల్ మస్క్యులర్ అట్రాఫీ టైప్-2’(Spinal Muscular Atrophy Type 2) అనేది జన్యు పరమైన వ్యాధి. ఇది ప్రపంచంలోనే అత్యంత అరుదైన వ్యాధి. కండరాలు బలహీనంగా ఉండటం, శరీరంలోని ఏదో ఒక అవయవంలో కదలికలు లేకపోవడం దీని ప్రధాన లక్షణం. చికిత్స తీసుకోకుంటే అనారోగ్యం తీవ్రమై మంచానికే పరిమితమవ్వాల్సి ఉంటుంది. ఒక్కోసారి ప్రాణాలు కూడా దక్కవు. అయితే, ఈ వ్యాధికి చికిత్స చాలా ఖర్చుతో కూడుకున్నది.
ఈ వ్యాధిని నయం చేయాలంటే నొవార్టిస్ (Novartis) ఫార్మా తయారు చేసిన రూ.16 కోట్లు ఖరీదైన జొల్జెన్స్మా (Zolgensma) ఇంజక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రపంచంలోనే ఇది అత్యంత ఖరీదైన ఔషధం. ఇది మనదేశంలో దొరకదు. విదేశాల నుంచి తెప్పించుకోవాల్సి ఉంటుంది. అయితే బిడ్డ పుట్టిన రెండేళ్ల లోపే దీన్ని తీసుకోవాలి.ఇది అంత ఈజీగా ఇవ్వరు. మెడికల్ ప్రిస్క్రిప్షన్, లేదా పిల్లల వైద్యుడి నుంచి ఒక లేఖను పంపితే వారు పరిశీలించి ఇంజక్షన్ ఇచ్చేందుకు అనుమతిస్తారు. ఇప్పటికే ఇలాంటి కేసులు మన దేశంలో చాలానే వెలుగు చూశాయి. ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా విరాళాల ద్వారానే ఆ ఇంజక్షన్ తెప్పించుకుని తమ చిన్నారి ప్రాణాలను కాపాడుకున్నారు.