Uttar Pradesh | ఆగ్రా, సెప్టెంబర్ 27: ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్లో దారుణ ఘటన చోటుచేసుకున్నది. మూఢనమ్మకాలతో ఒక స్కూల్ యజమాని తన పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థిని క్షుద్రపూజలకు బలిచ్చాడు. దీంతో స్కూల్ యజమాని, డైరెక్టర్‌తో పాటు ప్రిన్సిపాల్, ఇద్దరు ఉపాధ్యాయులను పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం డీఎల్ పబ్లిక్ స్కూల్ యజమాని అయిన జషోదన్ సింగ్‌కు క్షుద్ర పూజలు, మూఢ నమ్మకాలపై అపార నమ్మకం.
స్కూల్, తన కుటుంబం అభివృద్ధి చెందాలంటే ఎవరినైనా చిన్నారిని బలి ఇవ్వమని కుమారుడు, స్కూల్ డైరెక్టర్ అయిన దినేశ్ బాఘేల్‌కు చెప్పాడు. దీంతో అదే పాఠశాలలో రెండో తరగతి చదువున్న 11 ఏండ్ల కృతార్ధ్ను సెప్టెంబర్ 23న ఉపాధ్యాయుడు రాంప్రకాశ్ సోలంకి, దినేశ్ భాఘేల్, జషోదన్ సింగ్ కలిసి స్కూల్ హాస్టల్ నుంచి అపహరించారు.
తర్వాత విద్యార్థిని ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకుపోయారు. తర్వాత అక్కడ కొన్ని పూజలు చేశారు. ఇది చూసి ఆ బాలుడు ఏడవడం ప్రారంభించాడు. అనంతరం అతడి గొంతు నులిమి చంపారు. ఈ నరబలి జరుగుతున్న సమయంలో ప్రిన్సిపాల్ లక్ష్మణ్ సింగ్, మరో టీచర్ వీర్పాల్ సింగ్‌లు కూడా అక్కడే ఉండి ఎవరూ రాకుండా కాపలా కాశారు. తర్వాత బాలుడి మృతదేహాన్ని కారులో తీసుకుని వెళ్తుండగా, తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిని అరెస్ట్ చేశారు. తమ స్కూల్, కుటుంబం మరింత ఐశ్యర్యాభివృద్ధి పొందడానికే బాలుడిని నరబలి ఇచ్చినట్టు నిందితులు పోలీసులకు తెలిపారు.