న్యూఢిల్లీ, ఆగస్టు 14: వారణాసిలోని బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్‌యూ)లో తెలుగు ఆచార్యుడిపై పట్టపగలే హత్యాయత్నం జరిగింది. బీహెచ్‌యూ తెలుగు విభాగం శాఖాధిపతి చల్లా శ్రీరామచంద్రమూర్తి గత నెల 28న వర్సిటీ నుంచి ఇంటికి వస్తుండగా కొంతమంది కిరాయి హంతకులు ఆయనపై ఇనుపరాడ్లతో దాడికి పాల్పడ్డారు. దాడి అనంతరం పరారీలో ఉన్న కిరాయి హంతకుల్లో ఒకడు పోలీసులకు పట్టుబడగా.. దర్యాప్తులో కీలక విషయం బయటపడింది. వర్సిటీ మాజీ తెలుగు ఆచార్యుడు బూదాటి వెంకటేశ్వర్లు ఈ కుట్ర చేశాడని యూపీ పోలీసులు తేల్చారు.
ప్రస్తుత తెలుగు శాఖాధిపతిగా శ్రీరామచంద్రమూర్తిని తప్పిస్తే.. తిరిగి ఆ పదవి తానే పొందవచ్చుననే దురాలోచనతో వెంకటేశ్వర్లు ఈ హత్య కుట్రకు పాల్పడినట్టు పోలీసులు చెబుతున్నారు. ప్రధాన నిందితుడు వెంకటేశ్వర్లుతో పాటు మరికొంత మంది నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని వారణాసి పోలీసులు చెప్పారు. కిరాయి హంతకుల దాడిలో శ్రీరామచంద్రమూర్తి రెండు చేతులు విరిగిపోగా, తీవ్ర గాయాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు.