చెన్నై: తమిళనాడులోని మదురై మీనాక్షి ఆలయంలో ఉన్న 24 ఏళ్ల పార్వతి అనే ఏనుగు కంటిశుక్లాలతో బాధపడుతోంది. పార్వతి ఎడమ కంటి చూపు దెబ్బతిన్నది. కాలక్రమేణా పరిస్థితి క్షీణించింది. పార్వతిని పరీక్షించేందుకు థాయ్‌లాండ్ నుంచి వెటర్నరీ వైద్యుల బృందం వచ్చింది. ఈ బృందానికి థాయ్‌లాండ్‌లోని కాసెట్‌సార్ట్ యూనివర్సిటీ వెటర్నరీ మెడిసిన్ విభాగం నుంచి నిక్రాన్ థోంగి నాయకత్వం వహిస్తున్నారు.
నిక్రాన్ థోంగి అనే వెటర్నరీ డాక్టర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల వెటర్నరీ బృందం మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయాన్ని సందర్శించి, పార్వతికి కంటిశుక్లం చికిత్స చేసింది. రాష్ట్ర ఆర్థిక మంత్రి డాక్టర్ పీ త్యాగరాజన్.. వైద్య బృందం సేవలను పర్యవేక్షిస్తున్నారు. ‘ఆరేళ్ల క్రితం పార్వతి ఎడమ కంటిపై ఉన్న సమస్యను నేను మొదట గమనించాను. ఇప్పుడు కుడి కన్ను కూడా దెబ్బతింది. ఇప్పటి వరకు అత్యుత్తమ వైద్యులు, వైద్య సదుపాయాలతో ఆమెకు చికిత్స అందిస్తున్నాం. అలాగే కొనసాగిస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు.
కాగా, కాటరాక్ట్ సర్జరీ సాధ్యాసాధ్యాలపై కూడా చర్చించినట్లు మంత్రి తెలిపారు. శస్త్రచికిత్స అనంతరం పార్వతి కంటికి మరింత నష్టం జరగకుండా నిరోధించడం సవాలుతో కూడుకున్నదని వైద్యులు తెలిపారన్నారు. పార్వతి పరిస్థితి జన్యుపరమైన లేదా గతంలో జరిగిన గాయం వల్ల కావచ్చునని వైద్యులు చెప్పారని మంత్రి వెల్లడించారు.