Monkeypox | న్యూఢిల్లీ: ఇప్పటికే ఆఫ్రికా దేశాలను వణికిస్తున్న ప్రాణాంతకమైన మంకీపాక్స్ (ఎంపాక్స్) లక్షణాలున్న అనుమానిత కేసు భారత్‌లో నమోదైంది. ఓ ఆఫ్రికన్ దేశం నుంచి వచ్చిన ఒక యువకుడిలో వ్యాధి లక్షణాలు కన్పించడంతో వెంటనే అతడిని ఐసోలేషన్‌కు తరలించారు. అతనికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం తెలిపింది. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. వ్యాధి సంక్రమణ మూలాలను గుర్తించేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్ కొనసాగుతున్నట్టు పేర్కొన్నారు. ఎంపాక్స్‌కు సంబంధించి ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ఆరోగ్య శాఖ తెలిపింది.
పాట్నా: న్యూఢిల్లీ-ఇస్లాంపూర్ మగధ్ ఎక్స్‌ప్రెస్ కప్లింగ్ ఊడిపోవడంతో రైలు రెండు భాగాలుగా విడిపోయింది. బీహార్‌లోని బక్సర్ జిల్లా, ట్వినిగంజ్-రఘునాథ్‌పూర్ రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం 11.08 గంటలకు ఈ సంఘటన జరిగింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని తూర్పు మధ్య రైల్వే సీపీఆర్ఓ సరస్వతి చంద్ర చెప్పారు. ఎస్-6, ఎస్-7 బోగీలను కలుపుతున్న కప్లింగ్ ఊడిపోవడంతో, 14 బోగీలు ఒకవైపు, 13 బోగీలు మరోవైపు విడిపోయినట్లు తెలిపారు. ఫలితంగా డౌన్ లైన్లో ట్రైన్ ట్రాఫిక్‌కు కాసేపు అంతరాయం కలిగిందన్నారు.