DoT warning : మీకు చీటికిమాటికి సిమ్ కార్డులు (SIM cards) మార్చే అలవాటు ఉందా..? పాత సిమ్ కార్డులను బ్లాక్ చేయించకుండా వదిలేస్తున్నారా..? అయితే మీరు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. ఒకవేళ మీ సిమ్ దుర్వినియోగం అయితే మీరు కోర్టు కేసుల (Court cases) ను ఎదుర్కొనే ప్రమాదమూ పొంచి ఉంది. ఈ మేరకు టెలికామ్ విభాగం (Department of Dot-DoT) కీలక ప్రకటన చేసింది.
ఒకవేళ మీ సిమ్ కార్డును ఎవరైనా సైబర్ మోసాలకో, చట్టవ్యతిరేక కార్యకలాపాలకో వాడినట్లు తేలితే.. ఆ సిమ్ కార్డు యజమానిగా మీరే బాధ్యులవుతారని డాట్ తన ప్రకటనలో స్పష్టంచేసింది. సిమ్ కార్డుల విషయంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అదేవిధంగా దొంగిలించిన మొబైల్స్‌లో IMEI నెంబర్లు మార్చి విక్రయిస్తున్నారని, అలాంటి వాటికి కూడా దూరంగా ఉండాలని, లేదంటే చిక్కుల్లో పడుతారని హెచ్చరించింది.
IMEI ట్యాంపర్ చేసిన మోడెమ్‌లను, మాడ్యూల్స్‌ను, సిమ్ బాక్సులను కొనడం, వినియోగించడం నేరమని డాట్ పేర్కొంది. అలాగే నకిలీ పత్రాలను సమర్పించి సిమ్ కార్డులను కొనుగోలు చేయడం, మీ పేరుమీద కొనుగోలు చేసిన సిమ్‌కార్డులను వేరొకరికి ఇవ్వడం నేరమని తెలిపింది. సైబర్ నేరాలు, ఇతర చట్టవ్యతిరేక కార్యకలాపాలకు మీ సిమ్‌కార్డు వినియోగించినట్లు తేలితే తీవ్రమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చింది.
టెలికమ్యూనికేషన్స్ చట్టం 2023 ప్రకారం.. మొబైల్స్ సహా ఇతర డివైజ్‌లలో IMEI (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ) ని ట్యాంపర్ చేస్తే మూడేళ్ల వరకు జైలు, రూ.50 లక్షల వరకు జరిమానా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో రెండూ విధించే అవకాశం ఉంటుందని డాట్ తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ రూల్స్, 2024 ప్రకారం.. IMEI మార్పు చేసిన డివైజ్‌లను వాడడం నిషేధమని డాట్ గుర్తుచేసింది.
సంచార్ సాథి మొబైల్ యాప్‌లో IMEI వివరాలను తనిఖీ చేసుకోవాలని పౌరులకు డాట్ సూచించింది. IMEI వివరాలు ఎంటర్ చేస్తే బ్రాండ్ నేమ్, మోడల్, తయారీ వివరాలు దర్శమిస్తాయని తెలిపింది. టెలికాం వనరుల దుర్వినియోగాన్ని నిరోధించడానికి, పౌరులందరికీ సురక్షితమైన టెలికమ్యూనికేషన్ సేవలను అందించడం కోసం ప్రభుత్వం కఠిన ఏర్పాట్లు చేసిందని పేర్కొంది.