న్యూఢిల్లీ, ఏప్రిల్ 6: ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణంలో భద్రతా వైఫల్యం చోటుచేసుకుంది. ఢిల్లీ అసెంబ్లీ ప్రాంగణం ప్రధాన ప్రవేశ గేట్లను పగులగొట్టుకుని లోపలకు దూసుకెళ్లిన ఓ గుర్తు తెలియని కారు అంతే వేగంతో నిష్క్రమణ గేటు నుంచి బయటకు వెళ్లిపోయింది. సోమవారం జరిగిన ఈ ఘటన అసెంబ్లీలో భద్రతా వ్యవస్థ వైఫల్యాన్ని బట్టబయలు చేస్తున్నది.
గేట్లు పగులగొట్టి లోపలకు దూసుకెళ్లిన కారు డ్రైవర్ స్పీకర్ విజేందర్ గుప్తా కార్యాలయం వెలుపల వాహనాన్ని ఆపి కారులో నుండి దిగి ఓ పుష్పగుచ్ఛాన్ని వాకిలి వద్ద పెట్టి అదే కారులో బయటకు దూసుకెళ్లిపోయినట్లు అధికారులు తెలిపారు.
టాటా సియెర్రా మోడల్‌కు చెందిన ఈ కారు రిజిస్ట్రేషన్ నంబర్ ఉత్తరప్రదేశ్దని వారు చెప్పారు. కేవలం ఐదు నిమిషాలపాటు లోపల ఉన్న కారు గేట్ నంబర్ 2 నుంచి బయటకు నిష్క్రమించిందని వారు తెలిపారు. కారు డ్రైవర్ ఎటువంటి అనుమానాస్పద వస్తువును వదిలిపెట్టి వెళ్లలేదని వారు చెప్పారు. నిందితుడిని సరబ్జీత్సింగ్గా గుర్తించిన పోలీసులు.. అతడిని ఢిల్లీలోని రూప్ నగర్ ఏరియాలో అనంతరం అదుపులోకి తీసుకున్నారు.