న్యూఢిల్లీ: బరువు తగ్గడం కోసం నియంత్రిత సమయంలో ఆహారం తీసుకుంటూ, ఉపవాసం చేసే విధానానికి ప్రపంచవ్యాప్తంగా ఆకర్షణ పెరుగుతున్నది. దీనివల్ల గుండె, రక్తనాళాల వ్యవస్థకు ముప్పు ఉండవచ్చునని తాజా అధ్యయనం వెల్లడించింది.
‘డయాబెటిస్ అండ్ మెటాబొలిక్ సిండ్రోమ్ : క్లినికల్ రీసెర్చ్ అండ్ రివ్యూస్’లో ప్రచురితమైన ఈ నివేదిక ప్రకారం, రోజులో 8 గంటల వ్యవధిలో ఆహారాన్ని తీసుకోవడం, మిగిలిన 16 గంటల్లో కేలరీలు లేని కాఫీ/టీ వంటివాటిని తీసుకోవడం వల్ల హృదయ సంబంధిత వ్యవస్థకు ముప్పు ఎక్కువగా ఉంటుంది. అమెరికా నేషనల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎగ్జామినేషన్లో పాల్గొన్న 19,000 మందికి సంబంధించిన సమాచారాన్ని పరిశోధకులు పరిశీలించారు.
సంవత్సరాల తరబడి రోజుకు తక్కువ వ్యవధిలో తినడం, మిగిలిన సమయంలో ఉపవాసం ఉండటం పట్ల జాగ్రత్త వహించాలని సలహా ఇచ్చారు. దీనికంటే సంప్రదాయ లేదా మతపరమైన ఉపవాసలతో మంచి ఫలితాలు ఉంటాయని డాక్టర్ అనూప్ మిశ్రా అన్నారు. ఇటువంటి ఆచారాలను పాటించడం తేలిక అని చెప్పారు. అయితే, మధుమేహంతో బాధపడేవారు నియంత్రిత సమయంలో ఆహారం తీసుకోవడం వల్ల బ్లడ్ సుగర్ తగ్గుతుందని, రోగ తీవ్రత ఎక్కువగా ఉన్న వృద్ధులకు కండరాల బలహీనతకు దారి తీయవచ్చునని వివరించారు.