న్యూఢిల్లీ, జూలై 10: దగ్గు మందులు, టానిక్లు, ఇతర ఔషధాల అమ్మకాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలు అమలులోకి తెచ్చింది. 12 శాతం కన్నా ఎక్కువ ఆల్కహాల్ ఉండే ఔషధాలను బహిరంగంగా విక్రయించడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. అర్హులైన డాక్టర్ ఇచ్చే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ మందులను ఇక అమ్మడానికి వీల్లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎందుకీ నిర్ణయం?
మార్కెట్లో లభించే అనేక దగ్గు మందులు, టానిక్లలో అధిక మొత్తంలో ఆల్కహాల్ ఉంటుంది. ఎటువంటి ఆంక్షలు లేదా వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి నేరుగా లభిస్తుండటంతో చాలా మంది వీటిని మత్తు కోసం లేదా దుర్వినియోగం చేయడం ప్రారంభించారు. ఈ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు, ఈ మందుల అమ్మకాలను కఠినంగా పర్యవేక్షించడానికి ప్రభుత్వం ఈ చర్య తీసుకుంది. మందుల దుర్వినియోగంపై పెరుగుతున్న ఆందోళన దృష్ట్యా ప్రభు త్వ నియంత్రణ కమిటీలైన డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ, డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ ఈ అంశాన్ని సమీక్షించాయి. ఈ కమిటీల సిఫార్సుల మేరకు ప్రభుత్వ చట్టాల్లో మార్పులు తీసుకువచ్చింది.
రోగులు, అమ్మకాలపై ప్రభావం
షెడ్యూల్ హెచ్1 పరిధిలోకి వచ్చిన తర్వాత మెడికల్ షాపులు ప్రభుత్వ నిబంధనలను పాటించక తప్పదు. చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే ఈ మందును విక్రయించాల్సి ఉంటుంది.