బెంగళూరు, జూన్ 13: పోక్సో కేసులో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత యెడియూరప్పపై గురువారం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. ఈ కేసులో అవసరమనుకుంటే మాజీ సీఎంను అరెస్ట్ చేస్తామని ప్రభుత్వం తెలిపింది. తన 17 ఏండ్ల కుమార్తెను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆయన ఇంట్లోనే లైంగికంగా వేధించినట్టు ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదుపై యెడియూరప్పపై పోక్సో చట్టం కింద సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నది. కాగా, 54 ఏండ్ల ఆ మహిళ ఇటీవలే అనారోగ్యంతో మరణించింది.
ఈ కేసులో యెడియూరప్పకు సీఐడీ సమన్లు జారీ చేయగా, కొంతకాలం వ్యవధి కావాలంటూ ఆయన కోరారు. అయితే, గురువారం బెంగళూరు కోర్టు ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.ఈ కేసులో అవసరమనుకుంటే యెడియూరప్పను సీఐడీ అరెస్ట్ చేస్తుందని కర్ణాటక హోం మంత్రి జీ పరమేశ్వర తెలిపారు. కేసు దర్యాప్తు అంతా క్రమపద్ధతిలోనే జరుగుతున్నదని ఈ నెల 15న సీఐడీ చార్జిషీట్ దాఖలు చేస్తుందని చెప్పారు.