న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: పురుషులకు ఏమాత్రం తీసిపోని అనుభవం, సమాన విద్యార్హతలు ఉన్నా కార్మిక విపణిలో మహిళలపై వివక్ష తీవ్రస్థాయిలో ఉన్నదని తాజా అధ్యయనంలో తేలింది. ఉపాధి పొందటంలో పురుషులతో పోల్చితే మహిళలు గ్రామాల్లో 100 శాతం, పట్టణాల్లో 98 శాతం లింగభేదాన్ని ఎదుర్కొంటున్నారని ఆక్స్ఫామ్ ఇండియా పేర్కొన్నది. ఈ మేరకు ‘ఇండియా డిస్క్రిమినేషన్ రిపోర్ట్-2022’ను రూపొందించింది.
ఈ నివేదిక ప్రకారం.. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటులో మహిళలు వెనుకబడ్డారు. సామాజిక, యాజమాన్య పక్షపాతం వల్లే ఈ దుస్థితి ఎదుర్కొంటున్నారు. స్వయం ఉపాధిలోనూ మహిళల కంటే పురుషులు 2.5 రెట్లు ఎక్కువగా సంపాదిస్తున్నారు. ఈ వివక్ష వల్లే ఆడ, మగ ఆదాయాల మధ్య 95 శాతం వ్యత్యాసం ఉన్నది. దళితులు, ఆదివాసీలు, మైనారిటీలు కూడా ఉద్యోగాలు, జీవనోపాధి, వ్యవసాయ రుణాలు పొందటంలో వివక్ష ఎదుర్కొంటున్నారని నివేదిక పేర్కొన్నది.