న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నివసించేందుకు ఓ కొత్త భవన సముదాయం సిద్ధం కానుంది. రాష్ట్రపతి భవన్‌కు సమీపంలో సౌత్ బ్లాక్ వెనుకవైపు ఈ భవనాన్ని 2,26,203 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ.450 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఇందులో ప్రధాని నివాసాన్ని 36,328 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టనున్నారు. దీంతో పాటు ప్రధాని కాన్వాయ్ వెళ్లేందుకు భూగర్భంలో ఒక సొరంగం కూడా నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నది. రెండేండ్లలో పూర్తికానున్న ఈ ప్రాజెక్టులో ప్రధానికి కార్యాలయం, ఇండోర్ క్రీడల సదుపాయం, సిబ్బందికి క్వార్టర్లు, ఎస్పీజీ ఆఫీసు, సేవా సదన్, భద్రతా కార్యాలయం ఉండనున్నాయి. సొరంగ మార్గాన్ని నేరుగా ప్రధాని ఇంటి నుంచి కొత్తగా నిర్మిస్తున్న ఎగ్జిక్యూటివ్ ఎన్‌క్లేవ్‌లోని ప్రధానమంత్రి కార్యాలయానికి, నూతన పార్లమెంట్‌కు, ఉపరాష్ట్రపతి నివాసానికి అనుసంధానిస్తారు. ప్రస్తుతం మోదీ నివాసముంటున్న 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లోని భవనం పీఎంవోకు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ప్రధాని తన నివాసం నుంచి పీఎంవోకు వెళ్లే సమయంలో ప్రతిరోజు ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది. ఇంతవరకు బాగానే ఉన్నది కానీ.. తెలంగాణలో సీఎం అధికార నివాసం కోసం ప్రగతి భవన్‌ను నిర్మిస్తే.. దానిలో వందల గదులున్నాయని, దాన్ని కూల్చేస్తామని ప్రతినలుబూనిన రాష్ట్ర బీజేపీ నేతలూ.. ప్రధాని కొత్త నివాసంపై మీరేమంటారు?