Bus Caught Fire | రాజస్థాన్లో మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కదులుతున్న బస్సులో మంటలు చెలరేగాయి. దాంతో పది నుంచి 12 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. వివరాల్లోకి వెళితే.. జైసల్మేర్ నుంచి జోధ్పూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు పిల్లలు, నలుగురు మహిళలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. గాయపడ్డ వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలైన వారిని జోధ్పూర్కు తరలించారు.
కదులుతున్న బస్సుల్లోనే ఒక్కసారిగా పొగలు వచ్చాయి. కొద్ది నిమిషాల్లోనే బస్సంతా మంటలు వ్యాపించాయి. సమాచారం మేరకు.. జైసల్మేర్-జోధ్పూర్ హైవేలోని థైయత్ గ్రామం సమీపంలో మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 57 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఎప్పటిలాగే మధ్యాహ్నం 3 గంటలకు జైసల్మేర్ నుంచి జోధ్పూర్కు బయలుదేరింది. దాదాపు 20 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత, బస్సు వెనుక నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. డ్రైవర్, ప్రయాణికులు తేరుకునే లోపే బస్సంతా మంటలు వ్యాపించాయి.
బస్సులో ఉన్న చిక్కుకున్న వారంతా కేకలు వేశారు. పలువురు ప్రయాణికులు కిటికీలు పగులగొట్టి బయటపడ్డారు. చాలా మంది లగేజీ అంతా మంటల్లో కాలిపోయింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులంతా అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఫైర్, పోలీసు సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించి ఫైర్ ఇంజిన్లతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే, బస్సులో మంటలు వ్యాపించడానికి కారణాలు మాత్రం తెలియరాలేదు. ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బస్సు ఇంజిన్ లేదంటే వైరింగ్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రమాదంలో చాలామంది ప్రయాణికు ముఖాలు, చేతులు, కాళ్లు, పలుచోట్ల కాలిన గాయాలయ్యాయి.