న్యూఢిల్లీ: ఢిల్లీలోని బీడీ మార్గ్‌లో ఉన్న బ్రహ్మపుత్ర అపార్ట్‌మెంట్స్‌లో శనివారం భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. 2020లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన ఈ భవనంలో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీల నివాసాలు ఉన్నాయి. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇప్పటివరకు తెలియరాలేదు. భవన సముదాయంలోని పై అంతస్తులలో ఒకదాంట్లో మంటలు చెలరేగడంతో భవనంలో నివసిస్తున్న వారిలో భయాందోళనలు నెలకొన్నాయి.
మంటలను అదుపు చేసేందుకు పెద్ద సంఖ్యలో అగ్నిమాపక వాహనాలు అక్కడకు చేరుకున్నాయి. పార్లమెంట్‌కు కేవలం 200 మీటర్ల దూరంలో ఉన్న ఈ అపార్ట్మెంట్స్ పార్లమెంట్ సభ్యులకు కేటాయించిన అధికారిక నివాసాలలో ఒకటి. కాగా, అపార్ట్మెంట్ల వద్ద అగ్నిమాపక వాహనాలు అందుబాటులో లేకపోవడంపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ సాకేత్ గోఖలే సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు.
“ఇందులో నివసిస్తున్న వారంతా రాజ్యసభ ఎంపీలు. 30 నిమిషాల నుంచి అగ్నిమాపక వాహనాలేవీ రాలేదు. మంటలు ఇంకా చెలరేగుతూ వ్యాపిస్తున్నాయి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫైర్ ఇంజిన్లు ఇంకా రాలేదు. ఢిల్లీ ప్రభుత్వం సిగ్గుపడాలి అంటూ ఆయన మండిపడ్డారు. ఘటనపై అపార్టమెంట్ వాసులు మాట్లాడుతూ కొందరికి గాయాలయ్యాయని, ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. అపార్ట్మెంట్లో అగ్నిమాపక వ్యవస్థ లేదన్నారు.