Uttarpradesh : ఓ వ్యక్తి తన తల్లి ఏడేళ్ల క్రితమే చనిపోయినప్పటికీ ఆమె పేరిట పెన్షన్ (Pension) తీసుకున్నాడు. తల్లి బతికే ఉన్నట్లుగా తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి ఏడేళ్లుగా పెన్షన్ పొందుతూ వచ్చాడు. ఈవిధంగా మొత్తం రూ.44 లక్షలు కాజేశాడు. ఉత్తరప్రదేశ్ (Uttarpradesh) లోని మీరట్ (Meerut) లో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. స్వాతంత్ర్య సమరయోధుడి భార్య అయిన శాంతి దేవి (Shanti Devi) 2018 డిసెంబర్ 9న మరణించారు.
అయితే ఆమె కుమారుడు ప్రేమ్ సింగ్, తన తల్లి బతికే ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించాడు. ఫేక్ లైఫ్ సర్టిఫికెట్లను బ్యాంకులో సమర్పించి ఆమెకు వచ్చే స్వాతంత్ర్య సమరయోధుల, డిఫెన్స్ పెన్షన్‌ను కొనసాగేలా చేశాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోని సకౌటి తాండా బ్రాంచ్ ఖాతా నుంచి ఏటీఎం, యూపీఐ ద్వారా మొత్తం రూ.44,38,096 విత్‌డ్రా చేశాడు. ఈ మోసం 2025 అక్టోబర్ 8న సర్ధానా సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్‌కు అందిన ఒక ఫిర్యాదుతో బయటపడింది. దాంతో అప్రమత్తమైన బ్యాంకు అధికారులు ఖాతాను పరిశీలించగా అక్రమాలు వెలుగు చూశాయి.
అనంతరం బ్యాంకు మేనేజర్ 2025 నవంబర్ 27న దౌరాలా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. పోలీసులు తొలుత చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు బుధవారం ప్రేమ్ సింగ్‌తో పాటు అతనికి సహకరించిన వ్యక్తులపై మోసం, ఫోర్జరీ, కుట్ర వంటి సెక్షన్ల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసుపై దౌరాలా ఇన్స్పెక్టర్ సుమన్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. దర్యాప్తు జరిపి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.