మంగళవారం 19 జనవరి 2021
National - Dec 31, 2020 , 14:58:43

కొడుకు మీద కోపం.. కుక్కకు రెండెక‌రాల భూమి!

కొడుకు మీద కోపం.. కుక్కకు రెండెక‌రాల భూమి!

భోపాల్‌: ఆస్తి కోసం అన్న‌ద‌మ్ముల మ‌ధ్య, త‌ల్లిదండ్రులు పిల్లల మ‌ధ్య గొడ‌వ‌లు స‌హ‌జ‌మే. తాము సంపాదించిన ఆస్తిని పిల్ల‌ల‌కు ఇవ్వ‌డం ఇష్టం లేని వాళ్లు అనాథ శ‌ర‌ణాల‌యాల‌కు రాసివ్వ‌డ‌మూ మ‌నం చూశాం. కానీ మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఓ తండ్రి మాత్రం కొడుకు మీద కోపంతో త‌న‌కున్న భూమిలో ఓ రెండెక‌రాల‌ను పెంపుడు కుక్క పేరు మీద రాయ‌డం విశేషం. తాను చ‌నిపోయిన త‌ర్వాత ఆ కుక్క అనాథ‌గా మార‌డం త‌న‌కు ఇష్టం లేద‌ని, త‌న త‌ర్వాత ఆ కుక్క బాగోగులు చూసే వారికి ఆ రెండెక‌రాల భూమి చెందుతుంద‌ని కూడా త‌న వీలునామాలో రాశాడా తండ్రి. 

వీలునామా వైర‌ల్‌

ఓం నారాయ‌ణ్ వ‌ర్మ (50) అనే ఆ వ్య‌క్తి చేసిన ఈ ప‌ని ఇప్పుడు ప్ర‌ముఖంగా వార్త‌ల్లో నిలుస్తోంది. చింద్వారా జిల్లా బ‌రిబ‌డ‌కు చెందిన‌ ఈయ‌న‌కు మొత్తం 21 ఎక‌రాల భూమి ఉండ‌గా.. రెండెక‌రాలు కుక్కకు, మిగ‌తా భూమి మొత్తం త‌న భార్య పేరు మీద రాసేశాడు. త‌న కొడుకు మీద కోపంతోనే ఇలా చేసిన‌ట్లూ చెప్పాడు. త‌న భార్య‌, త‌న పెంపుడు కుక్క జాకీ మాత్ర‌మే త‌న బాగోగులు చూస్తున్నార‌ని, అందుకే వారికే త‌న ఆస్తి చెందేలా వీలునామా రాశాన‌ని అన్నాడు.

చివ‌ర్లో ట్విస్ట్‌

ఈ వార్త బ‌య‌ట‌కు రాగానే ఆహా.. ఆ కుక్క ఎంత అదృష్ట‌వంతురాలో అని చాలా మంది అనుకున్నారు. అయితే అంత‌లోనే ఓం నారాయ‌ణ ట్విస్ట్ ఇచ్చాడు. మొద‌ట్లో ఆవేశంలో తాను ఈ ప‌ని చేసినా.. త‌ర్వాత గ్రామ సర్పంచ్ జ‌మునా ప్ర‌సాద్ వ‌ర్మ పిలిచి న‌చ్చజెప్ప‌డంతో వీలునామాను ఉప‌సంహ‌రించుకుంటున్న‌ట్లు ఓం నారాయ‌ణ చెప్ప‌డం విశేషం.