Viral News : అవినాష్ బిజులీ (Avinash Bijuli) అనే ఓ యువ జాలరి పట్టిన చేప అతడి గొంతులో ఇరుక్కుపోయి ప్రాణాలు తీసింది. వలతో చేపలు పట్టిన అతడు ఒక చేపను తీసి నోటితో పట్టుకుని, వలలో ఉన్న మరో చేపను తీసేందుకు ప్రయత్నించాడు. ఇంతలో నోట పట్టుకున్న చేప జారి గొంతులో దూరింది. దాంతో ఊపిరాడక అవినాష్ ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. వైద్యుడు చేపను తీసేందుకు ప్రయత్నిస్తుండగానే అవినాష్ ప్రాణాలు కోల్పోయాడు. ఒడిశా (Odisha) రాష్ట్రంలోని మయూర్భంజ్ (MayurBhanj) జిల్లా దిఘి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. దిఘి గ్రామానికి చెందిన అవినాష్ గత శుక్రవారం మధ్యాహ్నం స్థానిక చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. చెరువులో వలవేసి తీయగా కొన్ని చేపలు చిక్కాయి. అయితే వల నుంచి చేపలను తీసే క్రమంలో అవినాష్ ఒక చేపను తీసి నోటితో పట్టకున్నాడు. మిగతా చేపలను తీసేందుకు ప్రయత్నించాడు. కానీ ఇంతలో నోట్లో పెట్టుకున్న చేప జారిపోయి గొంతులోకి వెళ్లింది. అయితే ఆ చేప గొంతులో నుంచి లోపలి జారక, బయటకు రాకపోవడంతో అవినాష్‌కు ఊపిరాడలేదు.
వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. వైద్యులు ఆ చేపను బయటికి తీసేందుకు ప్రయత్నిస్తుండగానే అవినాష్ మరణించాడు. అయితే వైద్యులు చికిత్స ఆలస్యం చేయడంవల్లే అవినాశ్ ప్రాణం పోయిందంటూ బాధిత కుటుంబసభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళనకు దిగారు.