Whale | న్యూఢిల్లీ : ఓ మగ తిమింగలం తగిన తోడు వెతుక్కొని పిల్లల్ని కనేందుకు ఏకంగా మూడు సముద్రాలు దాటి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించింది. ఈ రికార్డ్ స్థాయి వలస ప్రయాణాన్ని బజారుటో సెంటర్ ఫర్ సైంటిఫిక్ స్డడీస్ అధ్యయనం చేసింది. ఈ అధ్యయనం వివరాలు రాయల్ సొసైటీ ఓపెన్ సైన్స్ జర్నల్లో ప్రచురితమయ్యాయి. ఈ తిమింగలం చేసిన సుదీర్ఘ ప్రయాణాన్ని ఏఐ అల్గారిథం సాయంతో ఫొటో రికార్డింగ్ చేసి విశ్లేషించారు. ఈ తిమింగలం కనీసం 13,046 కి.మీ ప్రయాణించి ఉంటుందని, దానికి 19 వేల కిలోమీటర్లు ప్రయాణించే సామర్థ్యం ఉందని పరిశోధక బృందం తెలిపింది.
కొలంబియాలోని గల్ఫ్ ఆఫ్ ట్రిబుగా నుంచి ఈ తిమింగలం వలస ప్రయాణం ప్రారంభమైంది. ఆ తర్వాత దీన్ని టాంజానియాలోని జాంజిబార్ తీరంలో గుర్తించారు. ఈ అపూర్వ వలస ప్రయాణం చేయడానికి గల నిర్దిష్ట కారణాలు ఏమై ఉంటాయన్న విషయాన్ని శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నారు. పర్యావరణ మార్పులు, తోడు కోసం అనుసరించే వ్యూహాల్లో మార్పులు లేదా వనరుల మీద ఆధిపత్యం కోసం ఈ వలస జరిగి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
మూపుర తిమింగలాలు పాడే పాటలు, మాటలు వివిధ ప్రాంత్లాలో వేర్వేరుగా ఉంటాయని.. ఇప్పుడు ఈ మగ తిమింగలం కొలంబియన్ పాట పాడుతుందా లేక ఆఫ్రికన్ పాట పాడుతుందా అనే విషయం తెలుసుకోవాలని తమకు ఎంతో ఆసక్తిగా ఉందని అధ్యయనానికి నేతృత్వం వహించిన డాక్టర్ అయిలిన్ అక్కాయ చమత్కరించారు.