Kanpur | బెంగాల్ జూనియర్ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటన మరిచిపోక ముందే ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో అదే తరహాలో మరో ఘటన చోటు చేసుకున్నది. నైట్ షిఫ్ట్‌లో ట్రైనింగ్‌కు వెళ్లిన 22 ఏళ్ల విద్యార్థినిపై కల్యాణ్‌పూర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రి డైరెక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరంపులకు పాల్పడ్డాడు. నర్సింగ్ విద్యార్థిని సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది.
అర్ధరాత్రి సమయంలో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నిందితుడైన ఆస్పత్రి డైరెక్టర్‌ను అరెస్టు చేశారు. విద్యార్థిని వైద్య పరీక్షల కోసం పంపారు. సచెంది పోలీస్ స్టేషన్ పరిధిలోని 22 ఏళ్ల యువతి నర్సింగ్ కళాశాలలో జేఎన్ఎం ద్వితీయ సంవత్సరం చదువుతోంది. గత కొన్ని రోజులుగా ఆమె నేపాలీ దేవాలయం సమీపంలోని డబుల్ రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శిక్షణ పొందుతున్నారు. ఆదివారం రాత్రి ఆసుపత్రిలో నైట్‌షిప్ట్ ఉందని విద్యార్థిని పేర్కొంది.
తెల్లవారు జామున 4 గంటలకు నిద్రరావడంతో హాస్పిటల్ విశ్రాంతి గదిలో నిద్రపోయింది. ఆస్పత్రి డైరెక్టర్ ఇంతియాజ్ అలియాస్ సితు విద్యార్థిని పడుకున్న గదిలోకి వెళ్లి ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెను బెదిరింపులకు గురి చేసి.. నోట్లో దూది పెట్టి లైంగిక దాడికి పాల్పడ్డాడని ఆరోపణలున్నాయి. సదరు విద్యార్థిని ఉదయం ఆసుపత్రికి వచ్చిన తోటి నర్సులు, ఇతర సిబ్బందికి తెలుపడంతో అందరూ కలిసి పోలీస్‌స్టేషన్ ఫిర్యాదు చేశారు. అయితే, అత్యాచారానికి ముందు నర్స్‌కి కూల్‌డ్రింక్‌లో మత్తు మందు కలిపి ఇచ్చినట్లు అనుమానిస్తున్నారు.