న్యూఢిల్లీ, జూలై 11: రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్, బీజేపీ ఎంపీపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కేసులో కీలక విషయం బయటకు వచ్చింది. బాధిత మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదులు, వాటిపై ఇప్పటి వరకు చేసిన దర్యాప్తు ఆధారంగా.. లైంగిక వేధింపులు, అసభ్యకరంగా ప్రవర్తించడం, ఇతర ఆరోపణలకు సంబంధించి బ్రిజ్‌భూషణ్‌ను విచారించొచ్చని, నేరాలకు ఆయన శిక్షార్హుడేనని ఢిల్లీ పోలీసులు కోర్టుకు సమర్పించిన చార్జిషీట్లో పేర్కొన్నారు.
ఈ మేరకు పోలీసులు దాఖలు చేసిన వెయ్యి పేజీల చార్జిషీట్‌ను ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’ వార్తా పత్రిక సంపాదించింది. ఆరుగురు మహిళా రెజ్లర్లు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఢిల్లీ పోలీసులు బ్రిజ్‌భూషణ్‌పై ఐపీసీ సెక్షన్ 506(నేరపూరిత బెదిరింపు), 354ఏ(లైంగిక వేధింపులు), 354డీ(అసభ్యకరంగా ప్రవర్తించడం) తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఒకరి విషయంలో అయితే బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులు పదేపదే పునరావృతమయ్యాయని చార్జిషీట్లో పేర్కొన్నారు.
బ్రిజ్‌భూషణ్‌తో పాటు సాక్షులకు కూడా సమన్లు ఇవ్వాలని ఢిల్లీ పోలీసులు కోర్టును అభ్యర్థించినట్టు వార్తా కథనం పేర్కొన్నది. చార్జిషీట్ ప్రకారం.. పోలీసులు 108 మంది సాక్షులను ప్రశ్నించారు. వారిలో పలువురు రెజ్లర్లు, కోచ్‌లు, రిఫరీలు సహా 15 మంది మహిళా రెజ్లర్లు బ్రిజ్‌భూషణ్‌పై చేసిన ఆరోపణలు వాస్తవమేనని ధ్రువీకరించారు.