ముంబై: మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో ఒక బ్యాంక్ వినూత్న పథకానికి శ్రీకారం చుట్టింది. ఆ బ్యాంక్‌కు రుణం కోసం వెళ్తే నగదుకు బదులుగా ఒక మేకను రుణంగా ఇస్తారు. ఈ గోట్ బ్యాంక్ ఇప్పటివరకు ఇలా 300 మందికి మేకలను రుణంగా ఇచ్చి వారికి ఉపాధి కల్పించింది. ఇందులో వితంతువులు, భూమిలేని మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఈ రుణంతో వారు స్వయం ఉపాధి పొందుతున్నారు. జల్గావ్లోని ఒక ఫౌండేషన్ నడుపుతున్న ఈ బ్యాంక్ దగ్గరకు రుణం కోసం వెళ్లే మహిళలకు తొలుత వాటిని ఎలా పెంచాలో శిక్షణ ఇస్తారు.
తర్వాత వారికి ఒక మేకను రుణంగా ఇస్తారు. అయితే ఇక్కడ బ్యాంక్ రుణం ఎలా తీరుస్తారు అన్న సందేహం వస్తుంది ఎవరికైనా, మేకను రుణంగా తీసుకున్నారు కాబట్టి వారు తిరిగి మేకనే రుణ బకాయిగా బ్యాంక్‌కు చెల్లించాలి. అది ఎలాగంటే రుణం తీసుకున్న మహిళ తన మేకకు పుట్టిన మేక పిల్లను బ్యాంక్‌లో డిపాజిట్ చేయాలి. ఇలా 40 నెలల రుణ ఒప్పంద కాలంలో ఆ మహిళ నాలుగు ఆరోగ్యకరమైన మేక పిల్లలను బ్యాంక్‌కు ఇస్తుంది. అలా ఇచ్చిన మేక పిల్లలు పెద్దవైన తర్వాత బ్యాంక్ వారు దానిని ఇంకొకరికి రుణంగా ఇస్తారు. ఈ పథకం కారణంగా ప్రతి మహిళ ఏడాదికి రూ.30 వేలు సంపాదిస్తున్నట్టు స్థానికులు తెలిపారు.