ముంబై, నవంబర్ 20: మహారాష్ట్రలో మరో దారుణం జరిగింది. 14 ఏండ్ల బాలికపై ఒకడు పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. తొలుత బాలికకు గుండుగీసిన అతడు ఆపై సిగరెట్ పీకలతో తలపై వాతలు పెట్టి పైశాచిక ఆనందం పొందాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని అకోలా జిల్లాలో సోమవారం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని గణేశ్‌గా గుర్తించిన పోలీసులు అతడిని అరెస్టు చేశారు.
కేసు దర్యాప్తు చేస్తున్నారు. గత సెప్టెంబర్‌లో దక్షిణ ముంబైలోని ప్రభుత్వ హాస్టల్లో 18 ఏండ్ల యువతిపై లైంగికదాడి జరిపిన సెక్యూరిటీ గార్డ్.. ఆమెను గొంతు నులిపి చంపేశాడు. ఆ ఘటన మరువకముందే తాజా దారుణం వెలుగుచూసింది. దీంతో మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.