న్యూఢిల్లీ, జూన్ 20: దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దేశం దాష్టీకాన్ని ప్రదర్శించింది. 2020లో భారత సైనికులపై చైనా జరిపిన గల్వాన్ తరహా అమానుష దాడిని గుర్తు చేసేలా ఫిలిప్పీన్స్ నేవీకి చెందిన రెండు బోట్లపై చైనా సైనికులు కత్తులు, గొడ్డళ్లు, సుత్తులతో దాడి చేసి బోట్లను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పలువురు ఫిలిప్పీన్స్ నావికులు గాయపడ్డారు. బోటుల్లోకి చొరబడ్డ చైనా సైనికులు వాటిని ధ్వంసం చేసి, ఎనిమిది ఎం4 రైఫిళ్లు, నావిగేషన్ సామగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు అసోసియేటెడ్ ప్రెస్ వెల్లడించింది. కత్తులు, గొడ్డళ్లు, ఈటెలతో తమపై చైనా మిలటరీ సైనికులు దాడి చేసి తమ వద్ద ఉన్న ఆయుధాలను అపహరించుకుపోయారని ఫిలిప్పీన్స్ మిలటరీ తెలిపింది.