బెంగళూరు, నవంబర్ 27: ముఖ్యమంత్రి పదవి కోసం కర్ణాటక కాంగ్రెస్‌లో జరుగుతున్న రగడ గురువారం కొత్త మలుపు తీసుకుంది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య భీకర స్థాయిలో మాటల యుద్ధం మొదలైంది. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా మాట(వర్డ్) బలమే ప్రపంచ బలం. ఇచ్చిన మాటపైన నిలబడడమే ప్రపంచంలో అతి పెద్ద బలం. న్యాయమూర్తి అయినా, అధ్యక్షుడు అయినా లేక నాతోసహా మరెవరైనా మాటపైన నడవాలి అంటూ డీకే గురువారం ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవిని రెండున్నరేళ్లపాటు పంచుకోవడానికి రహస్య ఒప్పందం కుదిరినట్లు కాంగ్రెస్‌లో జరుగుతున్న ప్రచారాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ మాట గురించి డీకే పదేపదే చెప్పడంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఘాటుగా స్పందించారు.
మాట మీద డీకే చేసిన వ్యాఖ్యకు అదే మాటనే ఆయుధంగా చేసుకుంటూ సిద్ధరామయ్య జవాబిచ్చారు. ప్రజలకు మెరుగైన ప్రపంచాన్ని ఇవ్వనంతవరకు మాటకు బలం లేదు. కర్ణాటక ప్రజలు ఇచ్చిన తీర్పు క్షణికం కాదు.. పూర్తిగా ఐదేళ్లూ కొనసాగే బాధ్యత. నాతో సహా కాంగ్రెస్ పార్టీ కరుణ, స్థిరత్వం, ధైర్యంతో కూడిన మాటతో ప్రజలతో కలసి నడుస్తోంది. కర్ణాటకకు తన ప్రభుత్వం ఇచ్చే మాట నినాదం కాదు. అదే వారికి ప్రపంచం అంటూ సిద్ధరామయ్య ట్వీట్ చేశారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి తన ప్రభుత్వం తీసుకున్న చర్యలను ముఖ్యమంత్రి తన పోస్టులో వివరించారు. అయితే ఈ మాటల యుద్ధం ఎలాగున్నప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకున్నా తాము కట్టుబడి ఉంటామని వీరిద్దరూ ప్రకటించడం విశేషం.
కర్ణాటక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థ్రిల్లర్‌ని తలపిస్తోంది. నాయకత్వ మార్పుపై ఇప్పటి వరకు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య సాగిన రగడ ఢిల్లీకి చేరుకుంది. అదృశ్యరూపంలో ఎవరికీ కనిపించని కాంగ్రెస్ అధిష్ఠానం కర్ణాటక పంచాయితీపై తుది నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. కర్ణాటకలో బలీయమైన వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన డీకే ఇటీవల తనకు సహనం నశిస్తోందంటూ సూచనలు చేశారు. ఓబీసీ నాయకుడైన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య 2028 వరకు తానే సీఎంనంటూ ప్రకటిస్తూ వస్తున్నారు.
అయితే నవంబర్ 20వ తేదీకి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తి కావడంతో అప్రకటిత అధికార పంపకం ఒప్పందం మళ్లీ తెరపైకి వచ్చింది. గడచిన వారం రోజులుగా సిద్ధరామయ్య, శివకుమార్ వర్గాలు ఢిల్లీలో జోరుగా లాబీయింగ్ జరుపుతున్నాయి. డీకేకి పదోన్నతి కోరుతూ ఆయన తరఫున దాదాపు 10 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీలో పార్టీ నాయకత్వం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. చివరి రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా శివకుమార్ ఉంటారని పార్టీ అధిష్ఠానం ఏనాడో వాగ్దానం చేసినట్లు రాజకీయ వర్గాలలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు రాహుల్ గాంధీ, సిద్ధరామయ్య, శివకుమార్తోసహా సీనియర్ నాయకులతో ఢిల్లీలో సమావేశం నిర్వహిస్తానని పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇటీవల వెల్లడించారు.
కర్ణాటక కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయినట్లు స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో గురువారం మరో కొత్త పరిణామం చోటుచేసుకుంది. సిద్ధరామయ్యకు అత్యంత సన్నిహితులలో ఒకరైన హోం మంత్రి జీ పరమేశ్వర తన విధేయతను మార్చుకున్నారు. ముఖ్యమంత్రి రేసులో తాను కూడా ఉన్నట్లు రెండు రోజుల క్రితం కూడా ప్రకటించిన పరమేశ్వర పార్టీ అధిష్ఠానం నిర్ణయిస్తే ముఖ్యమంత్రిగా శివకుమార్‌ను అంగీకరించడానికి తనకు ఎటువంటి అభ్యంతరాలు లేవంటూ ప్రకటించారు. ఇది జరిగిన కొన్ని నిమిషాలకే సిద్ధరామయ్యకు మరో వీర విధేయుడైన జమీర్ అహ్మద్ ఖాన్ మాత్రం 2028 వరకు ముఖ్యమంత్రి పదవికి ఖాళీ లేదని స్పష్టం చేయడం విశేషం.