నోయిడా: ఢిల్లీలోని నోయిడాకు చెందిన ఓ కుటుంబం డిజిటల్ అరెస్టు(Digital Arrest)కు గురైంది. అయిదు రోజుల పాటు సైబర్‌నేరగాళ్లు.. ఆ ఫ్యామిలీకి చెందిన ముగ్గుర్ని డిజిటల్ అరెస్టు చేశారు. ఆ కుటుంబం నుంచి అయిదు రోజుల్లో వాళ్లు కోటి రూపాయలు కాజేశారు. ప్రభుత్వ అధికారులమని చెబుతూ.. మోసానికి పాల్పడ్డారు. సోమవారం ఈ ఘటనపై పోలీసు కేసు నమోదు అయ్యింది. సీబీఐ, కస్టమ్స్ అధికారులమని బెదరిస్తూ సైబర్ నేరగాళ్లు ఇటీవల దోపిడీకి పాల్పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే.
సైబర్ నేరంపై చంద్రబాన్ పలివాల్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిబ్రవరి ఒకటో తేదీన గుర్తు తెలియని వ్యక్తి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. టెలికాం రెగ్యులేటరీ బోర్డుకు ఫోన్ చేయాలని, లేదంటే సిమ్ కార్డు బ్లాక్ చేస్తామని బెదిరింపులు వచ్చాయి. ఫోన్ చేసిన తర్వాత తన కేసు ముంబై సైబర్ క్రైం బ్రాంచ్ వద్ద ఉందని చెప్పారు. 10 నిమిషాల తర్వాత ఓ వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్‌ను అంటూ వీడియో కాల్ చేశాడు. ముంబైలోని కొలావా పోలీసు స్టేషన్ నుంచి చేస్తున్నట్లు చెప్పాడు.
చంద్రబాన్ బెదిరింపులకు పాల్పడినట్లు ఆ వీడియో కాల్లో నకిలీ ఆఫీసర్ ఆరోపించాడు. అతనిపై 24 కేసులు నమోదు అయినట్లు కూడా పేర్కొన్నాడు. మనీ ల్యాండరింగ్ కోణంలోనూ సీబీఐ విచారణ కొనసాగుతున్నట్లు ఆ ఫీసర్ తెలిపాడు. వీడియో కాల్స్ ద్వారా తన భార్య, కూతుర్ని కూడా డిజిటల్ అరెస్టు చేసినట్లు పలివాల్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అమౌంట్ చెల్లించకుంటే, త్వరలో అరెస్టు చేస్తామని బెదిరించారు. అయిదు రోజుల పాటు డిజిటల్ అరెస్టు సాగిందని, భయంతో ఆ కుటుంబం 1.10 కోట్లు చెల్లించినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.