న్యూఢిల్లీ: గోద్రా అల్లర్లకు సంబంధించిన పలు కేసుల్లో తాజాగా 35 మంది నిందితుల్ని నిర్దోషులుగా పేర్కొంటూ గుజరాత్‌లోని ఓ కోర్టు శనివారం తీర్పు వెలువరించింది. ఓ వర్గం వారిని లక్ష్యంగా చేసుకొని సాగిన హత్యాకాండ, దాడులు..ఇవన్నీ ఓ ప్లాన్ ప్రకారం జరిగినవి కావని, హఠాత్తుగా జరిగి ఉంటాయని పంచమహల్ జిల్లా హాలోల్ టౌన్‌లోని ఓ కోర్టు పేర్కొంది. కలోల్‌లో ముగ్గురు ముస్లింలు హత్యకు గురయ్యారు.
ఈ ఘటనలకు సంబంధించి నాలుగు కేసుల్లో 52 మందిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు ఆరోపణలు నమోదు చేశారు. విచారణ కాలంలో 17 మంది నిందితులు చనిపోయారు. మిగిలిన వారిని నిర్దోషులుగా పేర్కొంటూ కోర్టు తాజాగా తీర్పు చెప్పింది. నిందితులకు వ్యతిరేకంగా సరైన సాక్ష్యాలు లేవని పేర్కొన్నది. సాక్ష్యాధారాలు దొరకకుండా చేయాలన్న ఉద్దేశంతోనే మృతదేహాల్ని కాల్చి బూడిదచేశారన్న ప్రాసిక్యూషన్ వారి వాదనల్ని తోసిపుచ్చింది.