మోర్బి, నవంబర్ 1: గుజరాత్లో కేబుల్ బ్రిడ్జి నిర్వహణ కంపెనీ.. ఓరెవా ఓనర్లు జంప్ అయ్యారు. కంపెనీ ఎగ్జిక్యూటివ్స్, ఇతర అధికారులు కూడా పత్తా లేకుండా పోయారు. కంపెనీ ఫామ్‌హౌజ్‌కు తాళం వేసేశారు. ఆఫీసుల వద్ద ఒక్క సెక్యూరిటీ గార్డూ లేరు. పదేండ్ల పాటు బ్రిడ్జికి ఢోకా లేదని చెప్పిన కంపెనీ ఎండీ జయ్‌సుఖ్‌భాయ్ పటేల్ కూడా ఘటన తర్వాత కనిపించకుండా పోయారు. వీరిని గుజరాత్ సర్కారే అజ్ఞాతంలోకి తరలించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఘటనలో కంపెనీకి చెందిన 9 మందిని అరెస్టు చేయగా వారంతా కిందిస్థాయి ఉద్యోగులు, టికెట్ కలెక్టర్లు, సెక్యూరిటీ గార్డులే. దీనిపై స్పందించిన విపక్షాలు.. పెద్ద తలకాయలను రక్షించేందుకు బీజేపీ సర్కారు కంపెనీ కింది స్థాయి ఉద్యోగులను బలి చేస్తున్నదని విమర్శించాయి.
దవాఖానకు రంగులు, టైల్స్
కేబుల్ బ్రిడ్జి ఘటనలో గాయపడ్డవారు జామ్‌నగర్‌లోని ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. వీరిని ప్రధాని మోదీ మంగళవారం పరామర్శించారు. అయితే, మోదీ వస్తున్నారని అధికారులు దవాఖాన రూపురేఖలే మార్చేశారు. హుటాహుటిన దవాఖానకు హంగులు అద్దారు. గేటు నుంచి మొదలుపెడితే బయటా,లోపల గోడలన్నీ రంగులతో నింపేశారు. దవాఖాన పరిసరాల్లో కొత్త టైల్స్ పరిచారు. గబ్బు పట్టిన టాయిలెట్లు ధగధగ మెరిసిపోయాయి. వార్డుల్లో లైట్లు, ఫ్యాన్లు వచ్చి చేరాయి. మోదీ క్షతగాత్రులను పరామర్శించే వార్డులో పాత బెడ్లను తీసేసి కొత్త బెడ్లను, వాటిపై కొత్త బెడ్ షీట్లను ఏర్పాటు చేశారు. అన్ని వార్డుల్లో వాటర్ కూలర్లను ఏర్పాటు చేశారు. ఇంత చేసినా, ఆ కూలర్లకు నీటి కనెక్షన్ ఇవ్వకపోవటం గమనార్హం. అంతకుముందు ప్రధాని మోదీ ఘటనాస్థలిని పరిశీలించినప్పుడు కూడా.. అక్కడ ఏర్పాటుచేసిన ఓరెవా కంపెనీ బోర్డు కనిపించకుండా అధికారులు ప్లాస్టిక్ కవర్‌తో కప్పేశారు.
దవాఖానలో ఫొటోషూట్ చేస్తున్నారా?
దవాఖానలో హంగుల ఫొటోలను విపక్ష కాంగ్రెస్ ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ‘అంత మంది ప్రజలు చనిపోతే సిగ్గు లేదా? మోదీ వస్తున్నారని దవాఖానను ఫొటోషూట్‌కు సిద్ధం చేస్తున్నారా?’ అని మండిపడింది. గుజరాత్ సర్కారులో చోటుచేసుకొన్న భారీ అవినీతికి ఫలితమే మోర్బి ఘటన అని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. మోర్బి ఘటన ప్రమాదం కాదని, అవినీతి బీజేపీ సర్కారు చేసిన హత్యలు అని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా ఆరోపించారు.
ఘటనపై 14న సుప్రీం విచారణ
కేబుల్ బ్రిడ్జి దుర్ఘటనపై దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై సుప్రీం కోర్టు వాదనలు విననున్నది. ఘటనపై న్యాయ కమిషన్ వేసి దర్యాప్తు చేపట్టాలన్న పిల్‌పై 14న వాదనలు వింటామని కోర్టు తెలిపింది. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ దారుణం జరిగిందని పిటిషన్‌దారు ఆరోపించారు.