న్యూఢిల్లీ, జూలై 11: విహార యాత్ర కోసం వియత్నాంకు వెళ్లిన భారతీయులు ఊహించని ప్రమాదానికి గురయ్యారు. ఆ దేశంలోని అతి పెద్ద ద్వీపమైన ఫూ క్వక్కు సమీపంలో ఉన్న హోన్ మే రుట్ న్గోయ్ ద్వీపం దగ్గర పడవ(స్పీడ్ బోట్)లో విహరిస్తుండగా ఆకస్మాత్తుగా అది బోల్తా పడటంతో 15 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో ముగ్గురు ఏపీ వ్యక్తులు, పది మంది తమిళులు, ఇద్దరు కేరళ వాసులు ఉన్నట్టు ఆయా రాష్ర్టాల సీఎంలు ప్రకటించారు. పడవ బోల్తా పడినపుడు అందులో 32 మంది భారతీయ పర్యాటకులు, నలుగురు సిబ్బంది ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. పర్యాటకులంతా హ్యాండ్ సెట్ తయారీ సంస్థ లావా తమ ఉద్యోగుల కోసం ఏర్పాటు చేసిన విహారయాత్ర నిమిత్తం వియత్నాం వెళ్లారు. సరిహద్దు రక్షణ దళాలు, నౌకాదళం, తీర రక్షక దళం, ఇతర ఏజెన్సీలు సహాయక చర్యలు చేపట్టడానికి ముందే సమీపంలోని పడవల సిబ్బంది 21 మంది ప్రయాణికులను రక్షించారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. చాలా మంది నీళ్ల లోపల చిక్కుకుపోవడంతో సహాయక చర్యలు కష్టతరంగా మారాయని, ఆ ప్రాంతంలో భారీ అలలు కూడా వస్తున్నాయని స్థానిక మీడియా తెలిపింది.
మరణించిన వారందరి మృతదేహాలను వెలికితీశామని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దవాఖానలకు తరలించారు. వియత్నాంలోని ఇండియన్ ఎంబసీ ఈ దుర్ఘటనను ధృవీకరించింది. అయితే ఘటనకు సంబంధించిన కచ్చితమైన వివరాలను వెల్లడించలేదు. 2025 జూలైలో హా లాంగ్ బేలో అకస్మాత్తుగా వచ్చిన తుపాను కారణంగా కనీసం 20 మంది పిల్లలతో సహా 48 మంది ప్రయాణిస్తున్న ఒక పర్యాటక పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో 35 మంది ప్రయాణికులు మరణించారు. తాజా విషాద ఘటన వియత్నాంలో ప్రముఖ పర్యాటక ప్రదేశాలలో సముద్ర భద్రత, అత్యవసర సన్నద్ధతపై మరోసారి భయాందోళనలను రేకెత్తించింది.
మృతుల పేర్లు విడుదల చేసిన ఎంబసీ
వియత్నాంలో ఫూ క్వోక్ ద్వీపం సమీపంలో పర్యాటక పడవ బోల్తా పడిన సమయంలో పడవలో ఉన్న 32 మంది భారత పర్యాటకుల పేర్లను అక్కడి భారతీయ ఎంబసీ విడుదల చేసింది. కంపెనీ ఏర్పాటు చేసిన ఆఫ్‌సైట్(కంపెనీ కార్యక్రమం)లో పాల్గొంటున్న తమ సంస్థ భాగస్వాములు, సిబ్బంది ఉన్నట్లు హ్యాండ్సెట్ తయారీ సంస్థ లావా తెలిపింది. వియత్నాంలోని భారత దౌత్య కార్యాలయం ప్రకటన ప్రకారం పడవలో ఉన్న 32 మంది భారతీయుల పేర్లను విడుదల చేసింది. ఈ భారతీయ పర్యాటకులు మొబైల్ ఫోన్ల తయారీ సంస్థ లావా ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక విహారయాత్రలో భాగంగా అక్కడకు వెళ్లారు. 100 మందికి పైగా చానల్ భాగస్వాములు, కంపెనీ ఉద్యోగులు ఈ యాత్ర కోసం భారత్ నుంచి వెళ్లారని, కొందరు తమ కుటుంబ సభ్యులతో కలసి వెళ్లారని సమాచారం. బోట్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ‘ఎక్స్’ వేదికగా స్పందిస్తూ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు.
రాకాసి అలే పొట్టనపెట్టుకుంది
‘ఒక రాకాసి అల వేగంగా మా బోట్‌ను తాకడంతో అది బోల్తా పడింది. అప్పటివరకు ఫొటోలు తీసుకుంటున్న మేం ఈ ప్రమాదంపై స్పందించే లోగానే అది జరిగిపోయింది’ అని బోట్లో ప్రయాణిస్తూ బతికి బయటపడిన నిర్మల్ కుమార్ అనే ప్రయాణికుడు తెలిపారు. అప్పుడు వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా లేవని, అయితే ద్వీపం వైపు నుంచి కొంత గాలి ఉన్నదని చెప్పాడు. అయితే బాధితులకు సీపీఆర్ చేయడానికి వైద్య బృందాలు కూడా అందుబాటులో లేవని మరో ప్రత్యక్ష సాక్షి ఆశిష్ కుమార్ ఆరోపించాడు.
హెల్ప్ లైన్ నంబర్లు
ప్రమాదం నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ సాధారణ పరిపాలన శాఖ కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్లు: 9885371189, 7997959754, 9989654807, 7997959779.