Prashant Kishor : బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సందడి జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. ఈ విషయంలో జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) ఒక అడుగు ముందే ఉంది. మొత్తం 243 స్థానాలకుగాను ఇప్పటికే రెండు జాబితాల్లో 116 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది.
ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్‌ను పట్నాలో మీడియా పలుకరించింది. ఎన్నికల్లో మీరు వ్యక్తిగతంగా ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించింది. అన్ని స్థానాల్లో తన పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడమే తన లక్ష్యమని, తాను ప్రత్యేకంగా పోటీ చేయాల్సిన అవసరం లేదని అన్నారు.
బీహార్‌లో అధికారమే లక్ష్యంగా తాము బరిలో దిగుతున్నామని పీకే చెప్పారు. ఈ ఎన్నికల్లో 243 స్థానాలకుగాను 150 స్థానాలు గెలువాలన్నది తమ టార్గెట్ అన్నారు. 150 స్థానాలకు ఒక్క స్థానం తగ్గినా తాము ఓడినట్లుగానే పరిగణిస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమ పార్టీ నుంచి గొప్పగొప్ప వ్యక్తులను బరిలో దించుతున్నమన్నారు.
తారాపూర్ నియోజకవర్గంలో జన సురాజ్ పార్టీ తరఫున ఓ గొప్ప వైద్యుడిని బరిలో దించామని ప్రశాంత్ కిశోర్ తెలిపారు. ఏడో తరగతి ఫెయిలైన డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌదరిని ఈ ఎన్నికల్లో ఆ వైద్యుడు ఓడించి తీరుతారని అన్నారు. బీజేపీ నాయకుడైన సామ్రాట్ చౌదరి ఎన్డీయే కూటమి తరఫున మరోసారి తారాపూర్ నుంచి పోటీచేస్తున్నారు.