Hands Transplant | ఆధునిక వైద్య విధానం అందుబాటులోకి రావడంతో ఎన్నో అద్భుతాలు ఆవిష్కృతమవుతున్నాయి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తుల అవయవాలను ఇతరులకు అమర్చి ఎందరికో జీవనదానం చేస్తున్నారు. అలాంటి ఓ అద్భుతం మరోసారి ఆవిష్కృతమైంది. బ్రెయిన్‌డెడ్ అయిన మహిళ అవయవాలతో యువతికి చేతులు అందించగలిగారు వైద్యులు. జీవితంలో ఇక చేతులు లేని అవిటిదానిలాగే ఉండిపోవాల్సి వస్తుందేమో అని బాధపడుతూ కూర్చున్న యువతి కన్నీళ్లు తుడిచారు ముంబై వైద్యులు.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో నివసించే వినీత ఖజాంచి అనే 52 ఏండ్ల మహిళ అనారోగ్యం పాలైంది. ఈ నెల 13 న తీవ్రమైన మెదడు సంబంధ వ్యాధి కారణంగా ఇండోర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చేరింది. చికిత్స పొందుతున్న వినీత రెండు రోజుల క్రితం బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. దాంతో దవాఖాన వైద్యులు, జీవన్‌దాన్ కార్యకర్తలు ఆమె అవయవాలను దానం చేసేలా కుటుంబీకులను ఒప్పించారు. ప్రత్యేక విమానంలో ఇండోర్ నుంచి ముంబైకి గ్రీన్ చానల్ ద్వారా అవయవాలను తరలించారు. ఈ చేతులను ముంబైలో చేతులు లేకుండా పుట్టిన ఓ టీనేజీ బాలికకు విజయవంతంగా అమర్చారు.
బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి నుంచి రెండు చేతులు తొలగించి మరో వ్యక్తికి మార్పిడి చేయడం అద్భుతమని ఇండోర్ సొసైటీ ఫర్ ఆర్గాన్ డొనేషన్ కార్యదర్శి డాక్టర్ సంజయ్ దీక్షిత్ తెలిపారు. అవయవాలు దొరక్క ఎందరో నరకయాతన పడుతున్నారని, బ్రెయిన్ డెడ్ అయిన వారు తమ అవయవాలను దానం చేయడం ద్వారా కనీసం 8 మందిని బతికించవచ్చునని సంజయ్ దీక్షిత్ చెప్పారు. బ్రెయిన్ డెడ్ అయిన వినీత కాలేయం, కిడ్నీలు, కళ్లు, ఊపిరితిత్తులు, చర్మం.. జీవన్‌దాన్‌లో పేర్లు నమోదు చేసుకుని ఎదురుచూస్తున్నవారికి అమర్చనున్నారు. ఇప్పటికే ఆమె కాలేయాన్ని చెన్నైకి తరలించినట్లు ముస్కాన్ గ్రూప్ ప్రతినిధి సందీప్ ఆర్యా తెలిపారు.