తిరువనంతపురం, సెప్టెంబర్ 16: నిఫా వైరస్‌తో 23 ఏండ్ల వ్యక్తి మరణించటంతో, కేరళలోని మలప్పురం జిల్లాలో తీవ్ర భయాందోళన నెలకొన్నది. వైరస్ ప్రభావిత ప్రాంతాల్లో స్కూల్స్, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలు, సినిమా థియేటర్లను ప్రభుత్వం మూసేయించింది. ప్రస్తుతం జిల్లాలో ముగ్గురు వ్యక్తులు నిఫా వైరస్ లక్షణాలతో దవాఖానలో చికిత్స పొందుతున్నారు. దీంతో పలు వార్డులను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించారు. ఇక్కడి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, జనం ఎక్కడా గుమికూడరాదంటూ జిల్లా కలెక్టర్ వీఆర్ వినోద్ నిషేధాజ్ఞలు జారీచేశారు. వైరస్ వ్యాప్తికి సంబంధించి కాంటాక్ట్ ట్రేసింగ్, పర్యవేక్షణ, ఫీవర్ సర్వే కోసం ఆరోగ్య శాఖ 16 కమిటీలను ఏర్పాటుచేసింది. మిలాద్-ఉన్-నబీ సందర్భంగా సోమవారం తలపెట్టిన ఊరేగింపును రద్దు చేసుకోవాల్సిందిగా మలప్పురం జిల్లా కలెక్టర్ మసీదు కమిటీలను కోరారు. దుకాణాలు, షాపింగ్ మాల్స్ ఉదయం 10 నుంచి రాత్రి 7 గంటల వరకు తెరిచి ఉంచుతున్నారు.