Uttar Pradesh | బంగారు రుణాల కోసం బ్యాంకులో కస్టమర్లు తాకట్టు పెట్టిన 96 గోల్డ్ ప్యాకెట్లు (Gold packets) మాయమవడం కలకలం రేపింది. ఈ సంఘటన ఉత్తర ప్రదేశ్‌లోని(Uttar Pradesh) ఫిరోజాబాద్ జిల్లాలో గల భారౌల్ శాఖ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో(Bank of India) వెలుగు చూసింది. బ్యాంక్‌లోని స్ట్రాంగ్ రూమ్ లాకర్ నుంచి దాదాపు రూ. కోట్లు విలువైన 96 ప్యాకెట్ల తాకట్టు బంగారం అదృశ్యమైందని పోలీసులు తెలిపారు.
సదరు బ్యాంక్ లాకర్ కీలక అధికారి దిలీప్ కుమార్ మే 27 నుంచి ఎలాంటి సమాచారం లేకుండా విధులకు గైర్హాజరయ్యారు. అనుమానం వచ్చిన అధికారులు జూన్ 15న డూప్లికేట్ తాళాలతో స్ట్రాంగ్ రూమ్‌ను తెరిచి చూడగా ఈ గోల్డ్ ప్యాకెట్లు మాయమైన విషయాన్ని గుర్తించి అప్పటి బ్రాంచ్ మేనేజర్‌తో సహా ముగ్గురు ఉద్యోగులపై బుధవారం రాత్రి అరౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
మాజీ బ్రాంచ్ మేనేజర్ సందీప్ యాదవ్, స్టాఫ్ ఆఫీసర్లు దిలీప్ కుమార్, నరేష్ కుమార్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ ఆదిత్య లాంగే తెలిపారు. బంగారం విలువ కోట్లలో ఉంటుందని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని ఎస్పీ తెలిపారు.