న్యూఢిల్లీ, డిసెంబర్ 18: పార్లమెంట్లో గత వారం చోటుచేసుకొన్న భద్రతా వైఫల్యం ఘటనపై ఉభయ సభలు సోమవారం అట్టుడికాయి. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఆందోళనలు కొనసాగించారు. దీంతో సభా కార్యకలాపాలకు అటంకం కలిగిస్తున్నారని పేర్కొంటూ లోక్సభలో 33 మందిని, రాజ్యసభలో 45 మంది విపక్ష ఎంపీలను సభాపతులు సస్పెండ్ చేశారు. మొత్తంగా రెండు సభల నుంచి సోమవారం ఒక్కరోజే 78 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. గత వారం కూడా 14 మంది సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సెషన్లో ఇప్పటివరకు ఏకంగా 92 మంది ప్రతిపక్ష ఎంపీలను ప్రభుత్వం సస్పెండ్ చేసినట్టు అయింది.
లోక్సభలో 33 మందిపై వేటు
లోక్సభలో 30 మంది ఎంపీలను సమావేశాలు ముగిసే వరకు సస్పెండ్ చేయగా.. స్పీకర్ పొడియం ఎక్కి నినాదాలు చేసిన మరో ముగ్గురిపై ప్రివిలేజ్ కమిటీ నివేదిక వచ్చేవరకు సస్పెండ్ చేస్తున్నట్టు స్పీకర్ తెలిపారు. సస్పెన్షన్ గురైన 33 మంది ఎంపీల్లో కాంగ్రెస్ నుంచి 11 మంది, డీఎంకే-10, టీఎంసీ-9 చొప్పున ఉన్నారు. పోడియం ఎక్కి అభ్యంతరంగా ప్రవర్తించారంటూ ఎంపీలు కే జయకుమార్, విజయ్ వసంత్, అబ్దుల్ ఖలేక్ సస్పెన్షన్పై మంత్రి ప్రహ్లాద్ జోషి వేరే తీర్మానం పెట్టారు.
రాజ్యసభలో 45 మంది ఎంపీలు..
రాజ్యసభలో 45 మంది ఎంపీలపై సస్పెన్షన్ వేటు పడింది. రాజ్యసభలో ఎంపీల సస్పెన్షన్పై సభా నాయకుడు పీయూష్ గోయల్ తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఈ తీర్మానాలను మూజవాణి ఓటుతో ఆమోదించారు. 11 మంది ఎంపీల ప్రవర్తనపై కమిటీ మూడు నెలల్లోగా నివేదిక ఇవ్వాలని సభ కోరింది. రాజ్యసభలో సస్పెన్షన్కు గురైన వారిలో కాంగ్రెస్ ఎంపీలు ప్రమోద్ తివారీ, జైరాం రమేశ్, కేసీ వేణుగోపాల్, సుర్జేవాలా, ఎస్పీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్, టీఎంసీ ఎంపీ శాంతను సేన్ తదితరులు ఉన్నారు.
పార్లమెంటరీ జవాబుదారీతనం లేదా?
గత వారం సస్పెన్షన్కు గురైన 13 మంది లోక్సభ ఎంపీల్లో కొంత మంది సోమవారం పార్లమెంట్ మెట్లపై కూర్చొని ఆందోళన చేపట్టారు. భద్రతా ఉల్లంఘన ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలనే ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నెల 13న అసలు ఏం జరిగిందనే దానిపై ప్రధాని లేదా హోంమంత్రి ప్రజలకు స్పష్టంగా చెప్పాలని ఎంపీ మహ్మద్ జావీద్ డిమాండ్ చేశారు. ఎంపీల సస్పెన్షన్ను విపక్షాలు తీవ్రంగా ఖండించాయి. ప్రభుత్వ నియంతృత్వం తారాస్థాయికి చేరిందని, అసమ్మతిని అణచివేస్తున్నదని కాంగ్రెస్ విమర్శించింది. రాజ్యసభలో విపక్ష ఎంపీల ఆందోళనల నడుమే ప్రభుత్వం రెండు బిల్లులను ఆమోదించుకొన్నది. జమ్ముకశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీల్లో కూడా మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని వర్తింపజేస్తూ తీసుకొచ్చిన రెండు బిల్లులను సభ మూజవాణి ఓటుతో ఆమోదించింది.
కేంద్రం గుప్పిట్లో ‘టెలికం’! ;లోక్సభలో బిల్లు
కీలకమైన టెలికమ్యూనికేషన్ బిల్లు-2023ను కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. టెలికం సర్వీసులపై కేంద్రానికి కీలక అధికారాలు కట్టబెడుతూ బిల్లులో నిబంధనలు పొందుపరిచింది. జాతీయ భద్రత పేరుతో టెలికం సర్వీసులను టేకోవర్ చేసుకునేందుకు, సస్పెండ్ చేసేందుకు కేంద్రానికి అధికారం ఉంటుంది. మరోవైపు కొత్త సిమ్ కార్డులు జారీచేసే ముందు టెలికం సంస్థలు బయోమెట్రిక్ గుర్తింపు తీసుకోవటం తప్పనిసరి చేసింది. ఇంటర్నెట్ ఆధారంగా పనిచేసే ఓటీటీ యాప్స్, వాట్సాప్, టెలిగ్రాం, డిజిటల్ పేమెంట్, వీడియో స్ట్రీమింగ్ యాప్స్, గూగుల్ మీట్.. మొదలైవాటికి బిల్లు నుంచి మినహాయింపు ఇచ్చింది. వీటికి కేంద్ర ఐటీ నిబంధనలు వర్తిస్తాయని పేర్కొన్నది. జాతీయ భద్రతను దృష్టిలో పెట్టుకొని నిర్దేశిత దేశాలకు చెందిన టెలికం పరికరాలు, యంత్రాలు వాడకుండా కేంద్రం అడ్డుకోవచ్చు. ప్రతిపాదిత టెలికం బిల్లుపై రాజ్యసభ ఆమోదం అవసరం లేకుండా కేంద్రం ‘మనీ బిల్లు’గా తీసుకురావటంపై బీఎస్పీ ఎంపీ రితేష్ పాండే అభ్యంతరం వ్యక్తం చేశారు.