చెన్నై, జనవరి 30: మర్రి చెట్టు ఊడల కింద కప్పేసి ఉన్న చోళుల కాలం నాటి 900 ఏండ్ల పురాతన శివాలయం తమిళనాడులో బయటపడింది. కృష్ణగిరి జిల్లా హోసూర్ సమీపంలోని బెగిలి గ్రామంలో దీనిని గుర్తించారు. చరిత్ర పరిశోధన సంస్థలు, కృష్ణగిరి మ్యూజియం సహకారంతో స్థానిక ఉపాధ్యాయురాలు జయలక్ష్మి , పురావస్తు పరిశోధకులు ఈ అలయాన్ని కనిపెట్టారు. కొండ దిగువన ఒక మర్రిచెట్టు ఉంది. 200 ఏండ్ల నాటి ఆ మర్రిచెట్టు ఊడలు పూర్తిగా విస్తరించి ఈ ఆలయాన్ని పూర్తిగా కప్పేశాయి. దీంతో అక్కడ ఒక ఆలయం ఉన్న విషయాన్ని కొన్ని తరాలుగా స్థానికులే ఎప్పుడూ గుర్తించలేక పోయారు.
వ్యవహారికంగా దీనిని పాండవ గుడిగా పిలిచినప్పటికీ ఈ ఆలయం బయటపడే వరకు అక్కడ గుడి ఉన్న సంగతి ఎవరికీ తెలియదు. 11వ శతాబ్దం నాటి ఈ ఆలయం కులోత్తుంగ చోళుడి ( క్రీ.శ 1070-1122) నాటిదని పురావస్తు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. మాస్టర్ చోళ శిల్పులు ఈ ఆలయాన్ని నిర్మించారనడానికి నిదర్శనాలు ఉన్నాయని వారు చెప్పారు.