షిల్లాంగ్: మేఘాలయాలో మరో మిత్రపక్షం నాశనానికి బీజేపీ కుట్ర పన్నింది. అధికార కూటమిలో భాగమైన బీజేపీ, మెజారిటీ సభ్యులున్న యునైటెడ్ డెమోక్రటిక్ పార్టీ (యూడీపీ) ఎమ్మెల్యేలను చీల్చేందుకు ప్లాన్ వేసింది. ఈ నేపథ్యంలో యూడీపీకి చెందిన సుమారు 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో విలీనం కానున్నట్లు తెలుస్తున్నది. (UDP MLAs To Merge In BJP) ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) అధికార కూటమిలో యూడీపీ, బీజేపీ భాగంగా ఉన్నాయి. 60 మంది సభ్యులున్న మేఘాలయ అసెంబ్లీలో ఎన్పీపీకి 26 మంది సభ్యుల మెజారిటీ ఉన్నది. అధికార కూటమిలో భాగమైన యూడీపీకి 12 మంది సభ్యులుండగా, బీజేపీకి కేవలం ఇద్దరు మాత్రమే సభ్యులున్నారు.
కాగా, మేఘాలయా అసెంబ్లీలో తన బలాన్ని పెంచుకునేందుకు బీజేపీ ప్లాన్ వేసింది. మిత్రపక్షానికి చెందిన యూడీపీ నాశనానికి తెర తీసింది. ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను చీల్చేందుకు కుట్రపన్నింది. దీంతో 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరవచ్చని తెలుస్తున్నది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో 9 మంది యూడీపీ ఎమ్మెల్యేలు సమావేశమై దీనిపై చర్చించినట్లు సమాచారం. అయితే ఫారిన్ కాంట్రిబ్యూషన్ (రెగ్యులేషన్) యాక్ట్, మేఘాలయకు సంబంధించిన ఇతర అంశాలపై అమిత్ షాతో తాము చర్చలు జరిపినట్లు ఆ ఎమ్మెల్యేలు తెలిపారు.
మరోవైపు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాకు అత్యంత సన్నిహితుడిగా భావించే యూడీపీ అధ్యక్షుడు మెట్బా లింగ్డోపై ఆ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల జరిగిన కేంద్ర కార్యవర్గ సమావేశంలో పార్టీ నాయకత్వంపై శాసనసభ్యులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వాగ్వాదాల అనంతరం కొందరు వాకౌట్ చేసినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో యూడీపీలో అసంతృప్తి పెరుగుతున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన సుమారు 9 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరవచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే అనర్హత వేటు నుంచి తప్పించుకునేందుకు బీజేపీలో వారు విలీనం కానున్నట్లు తెలుస్తున్నది. ఒకవేళ అదే జరిగితే మేఘాలయాలో రాజకీయ సమీకరణలు మారనున్నాయి. అధికార కూటమిలో బీజేపీ సంఖ్యాబలం పెరుగుతుంది. తద్వారా రానున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి మరింతగా పుంజుకోవాలని కాషాయ పార్టీ యోచిస్తున్నది.