ముంబై: దేశంలోని యువ మేథావులు తమ మొదటి ఛాయిస్‌గా ప్రతిష్ఠాత్మక విద్యా సంస్థ ఐఐటీ బాంబేను ఎంచుకున్నారు. జేఈఈ అడ్వాన్స్‌లో టాపర్‌గా నిలిచిన పది మందిలో 9 మంది ఐఐటీ బాంబేకు మొగ్గు చూపారు. టాప్ 10లో 9 మంది బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివేందుకు ఐఐటీ బాంబేలో ఎన్రోల్ చేసుకున్నారు. అంతేగాక 50 మంది టాపర్లలో 43 మంది, వంద టాప్ ర్యాంకర్లలో 50 శాతానికిపైగా అంటే 58 మంది ఐఐటీ బాంబేలో అడ్మిషన్ పొందారు.
జేఈఈ అడ్వాన్స్ టాపర్ల తర్వాత ఛాయిస్‌లో ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ మద్రాస్ నిలిచాయి. వంద మంది టాపర్లలో 32 మంది ఐఐటీ ఢిల్లీని ఎంచుకున్నారు. టాప్ వెయ్యి మంది టాపర్ల ప్రధాన ఛాయిస్‌లో ఐఐటీ బాంబై, ఐఐటీ ఢిల్లీ, ఐఐటీ రూర్కే, ఐఐటీ మద్రాస్ ఉన్నాయి. ఐఐటీ కాన్పూర్, ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ హైదరాబాద్‌కు కొంత మంది టాపర్లు మాత్రమే మొగ్గుచూపారు.
కాగా, జేఈఈ అడ్వాన్స్ టాపర్స్ ప్రాధాన్య ఎంపికగా తమ విద్యా సంస్థ నిలిచిందని ఐఐటీ బాంబే డైరెక్టర్ సుభాసిస్ చౌధురి తెలిపారు. ఒక కోర్సుకు అడ్మిషన్లు పూరైన వెంటనే మరో కోర్సులో అడ్మిషన్లకు టాపర్లు ఆసక్తి చూపారని చెప్పారు. పది మంది టాపర్లలో ఏకంగా 9 మంది అడ్మిషన్లు పొందటం చాలా గొప్ప విషయమని అన్నారు.