సిటీ బ్యూరో, ఫిబ్రవరి 15 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లోని ఓటర్లు బీఆర్ఎస్ పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. నగర శివార్లలోని ప్రాంతాలన్నీ బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట అని మరోసారి నిరూపించారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ అరాచక పాలనకు వ్యతిరేకంగా కదం తొక్కారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేసిన అభివృద్ధికి గీటురాయిలాగా మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో తమ వాణి వినిపించారు. అధికార కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, ఎంఐఎంతో కుమ్మక్కై బరిలోకి దిగినా ఓటర్లు బీఆర్ఎస్కు ఏకపక్షంగా జై కొట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని కుయుక్తులకు పాల్పడినా వాటిని తమ అమూల్యమైన ఓటుతో తిప్పికొట్టారు. సాధారణ ఎన్నికలు, స్థానిక సంస్థల్లో గ్రేటర్ హైదరాబాద్ శివారుల్లోని ప్రాంతాలు బీఆర్ఎస్కు ఏవిధంగా మద్దతు తెలిపారో పురపాలక ఎన్నికల్లోనూ దాన్ని పునరావృతం చేశారు.
కాంగ్రెస్‌కు ఓటుతో బుద్ధిచెప్పిన శివారు.. మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో దాదాపు 90 శాతానికి పైగా మున్సిపాలిటీల్లో అధికార కాంగ్రెస్ కుంటే బీఆర్ఎస్ పార్టీకి ఎక్కువ ఓటింగ్ శాతం నమోదైంది. అధికార కాంగ్రెస్ ముక్కీమూలిగి బీఆర్ఎస్ కంటే 1.94 శాతం ఓట్లను ఎక్కువగా సాధించింది. రెండున్నరేండ్లలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరిట చేస్తున్న మోసాన్ని గుర్తించిన ఓటర్లు తగిన బుద్ధి చెప్పారు. తెలంగాణ ప్రజలకు ఎన్నటికైనా బీఆర్ఎస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష అని మరోసారి రుజువు చేశారు. ఏకంగా సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రమంతా తిరిగి సభలు, సమావేశాలు నిర్విహించినా ఓటర్లు పట్టించుకోలేదు. చాలాచోట్ల బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం కలిసి ఓట్లడిగినా ప్రజలు బీఆర్ఎస్కే మొగ్గు చూపారు. ఇక బీజేపీకి చాలా చోట్ల రెండంకెల ఓట్లు నమోదు కాలేదు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గ్రేటర్ హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల ప్రజలు కేసీఆర్ చేసిన అభివృద్ధికి పట్టం కడుతూ వస్తున్నారు. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ అదే పంథా కొనసాగించారు.
ఎన్ని ప్రలోభాలు చేసినా.. స్వల్ప ఆధిక్యమే
గ్రేటర్ హైదరాబాద్ శివారు జిల్లాలైన మేడ్చల్, సంగారెడ్డి, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని మున్సిపాలిటీలన్నింటిలో కలిపి అధికార కాంగ్రెస్ కేవలం 1.94 శాతం ఓట్లు మాత్రమే ఎక్కువ సాధించగలిగింది. ఇక మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల్లోని మున్సిపాలిటీలో కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ పార్టీకి సుమారు 5 శాతం ఎక్కవ ఓటింగ్ నమోదైంది. మేడ్చల్ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో కలిపి 89,230 ఓట్లు నమోదయ్యాయి. అందులో బీఆర్ఎస్ పార్టీకి 23,305 ఓట్లు పడగా.. అధికార కాంగ్రెస్‌కు కేవలం 19,789 ఓట్లు మాత్రమే పడ్డాయి.
బీజేపీ కేవలం 7,332 ఓట్లకే పరిమితమైంది. మొత్తం నాలుగు జిల్లాలకు చెందిన శివారు ప్రాంతాల్లోని 18 మున్సిపాలిటీలకు కలిపి 4,44,120 ఓట్లు పోలవ్వగా.. అందులో 1,50,198 ఓట్లు బీఆర్ఎస్ పార్టీకి పడగా 33.82 శాతంగా నమోదైంది. అధికార కాంగ్రెస్‌కు 1,58,805 ఓట్లు పడితే 35.76 శాతంగా నమోదైంది. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కేవలం 49,296 ఓట్లు పడ్డాయి. ఆ పార్టీ 11.10 శాతానికే పరిమితమైంది. మొత్తంగా అధికార కాంగ్రెస్ కిందామీదా పడి 1.94 శాతం ఓట్లను ఎక్కువగా సాధించింది. అధికార కాంగ్రెస్ కంటే అలియాబాద్, మూడుచింతలపల్లి, ఎల్లంపేట, ఆమనగల్, గడ్డపోతారం, గుమ్మడిదల, ఇంద్రేశం మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ అత్యధిక ఓట్లు సాధించింది. ఆయా మున్సిపాలిటీల ప్రజలు కేసీఆర్ వెంటే ఉంటామని మరోసారి రుజువు చేశారు.

Ss