న్యూఢిల్లీ: లెబనాన్, సిరియాల్లో కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే పేజర్లు వందలాదిగా పేలిపోవడం కలకలం రేపింది. మంగళవారం దాదాపు ఒకే సమయంలో అనేకచోట్ల జరిగిన ఈ సంఘటనల్లో హెజ్బొల్లా ఉగ్రవాదులు, మెడిక్స్ 9 మంది మరణించారు. దాదాపు 3,000 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో లెబనాన్ పార్లమెంటులో హెజ్బొల్లా సభ్యుని కుమారుడు, మరో ఉగ్రవాది కుమార్తె (10) కూడా ఉన్నారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఇంత పెద్ద ఎత్తున జరిగిన భద్రతా ఉల్లంఘన ఇదేనని హెజ్బొల్లా వర్గాలు చెప్తున్నాయి. ఈ పేలుళ్లకు కారణాలను గుర్తించేందుకు విస్తృత స్థాయిలో భద్రత, శాస్త్రీయ దర్యాప్తు జరుగుతున్నట్లు హెజ్బొల్లా ఒక ప్రకటనలో తెలిపింది. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగించి, వ్యక్తులు కమ్యూనికేషన్ కోసం ఉపయోగించే పేజర్లను పేల్చేశారని పేర్కొన్నది. ఇరాన్ ప్రభుత్వ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, లెబనాన్‌లోని ఇరాన్ రాయబారి మొజ్తబ అమని ఉపయోగించే పేజర్ కూడా పేలడంతో ఆయన స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తున్నది.
లెబనాన్ రాజధాని బీరుట్ శివారు ప్రాంతాల్లో పేజర్ల పేలుళ్లలో వందలాది మంది గాయపడ్డారు. వీరిని వేర్వేరు దవాఖానల్లో చేర్పించారు. దక్షిణ లెబనాన్‌లో కూడా పేజర్లు పేలాయని, అనేక మంది గాయపడ్డారని వార్తా సంస్థలు చెప్తున్నాయి. సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న సమయంలో ఇజ్రాయెల్ రిమోట్ దాడికి పాల్పడిందని లెబనాన్ అధికారులు ఆరోపించారు. సిరియాలో కూడా కొన్ని చోట్ల పేజర్లు పేలి, కొందరు గాయపడినట్లు మీడియా కథనాలను బట్టి తెలుస్తున్నది.
లెబనాన్ స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రారంభమైన ఈ పేజర్ల పేలుళ్లు వరుసగా ఓ గంట సేపు కొనసాగాయి. దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఈ సంఘటనలు జరిగాయి. 50కిపైగా అంబులెన్స్‌లను, 300 మంది ఎమర్జెన్సీ మెడికల్ స్టాఫ్‌ను రంగంలోకి దించినట్లు లెబనీస్ రెడ్ క్రాస్ తెలిపింది. ఇటీవలి షిప్మెంట్లో వచ్చిన కొత్త పేజర్లను విసిరికొట్టాలని హెజ్బొల్లా తన సభ్యులను మంగళవారం ఆదేశించింది. మునుపెన్నడూ లేనివిధంగా శత్రువు అనేక ప్రాంతాల్లో భద్రత ఉల్లంఘనకు పాల్పడినట్లు తెలిపింది.
ఈ దాడులకు కారణం ఇజ్రాయెల్ అని హెజ్బొల్లా ఆరోపిస్తున్నప్పటికీ, ఇజ్రాయెల్ సైన్యం తక్షణం స్పందించలేదు. అయితే, గత ఏడాది అక్టోబరు 7 దాడుల అనంతరం ప్రారంభమైన యుద్ధ లక్ష్యాలను విస్తృతం చేస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత ఈ దాడులు జరగడం గమనార్హం. ఈ నేరపూరిత దాడులకు పూర్తి బాధ్యత ఇజ్రాయెల్దేనని హెజ్లొల్లా ఓ ప్రకటనలో ఆరోపించింది. ఈ దాడికి తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందని, తగిన శిక్షను అనుభవించవలసి ఉంటుందని హెచ్చరించింది.
కొత్తగా వచ్చిన పేజర్లలోని లిథియం బ్యాటరీలే పేలి ఉంటాయని ఓ వార్తా సంస్థ తెలిపింది. వీటిని కొద్ది నెలల క్రితం హెజ్బొల్లా స్మగ్లింగ్ చేసి, తీసుకొచ్చినట్లు పేర్కొంది. లిథియం బ్యాటరీలు అతిగా వేడెక్కితే, పొగలు వస్తాయి, కరిగిపోతాయి. ఆ తర్వాత మండిపోయే అవకాశం కూడా ఉంటుంది. రీఛార్జబుల్ లిథియం బ్యాటరీలను సెల్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, ఎలక్ట్రిక్ కార్లు వంటి కన్జూమర్ ప్రొడక్ట్స్‌లో ఉపయోగిస్తారు. లిథియం బ్యాటరీ మండితే 590 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు మండుతుంది. కాగా, పేజర్లనే ఈ విధంగా పేల్చగలినప్పుడు స్మార్ట్ఫోన్లను పేల్చితే పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.