(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 3 (నమస్తే తెలంగాణ): మోదీ సర్కారు పాలనలో దేశంలో నిరుద్యోగం అంతకంతకూ పెచ్చరిల్లుతున్నది. ఉన్నత చదువులు పూర్తిచేసిన వారికి కూడా అర్హతకు తగినట్టు ఉపాధి అవకాశాలు లభించడం లేదు. దేశంలో చదువుకు తగ్గ ఉద్యోగాలు చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతం మంది మాత్రమే ఉన్నారని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడించింది. 50 శాతానికి పైగా పట్టభద్రులు తమ డిగ్రీని పక్కనబెట్టి.. క్లర్క్, మెషీన్ ఆపరేటర్ వంటి ఏడో తరగతి స్థాయి ఉద్యోగాలను చేస్తున్నట్టు పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (పీఎల్ఎఫ్ఎస్) మరో నివేదికలో వెల్లడించింది.
దేశంలోని 47 శాతం మందిలో కంపెనీలకు అవసరమైన నైపుణ్యాలు కొరవడినట్టు అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్వో) తాజా నివేదికలో పేర్కొంది. మరోవైపు, ఇంజినీరింగ్ విద్య పూర్తిచేసిన 83 శాతం మందికి ఇంకా ఉద్యోగాలు లభించలేదని స్కిల్ డెవలప్మెంట్ కంపెనీ ‘అన్‌స్టాప్’ ఇటీవల విడుదల చేసిన టాలెంట్ రిపోర్ట్-2025లో వెల్లడైంది. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ పూర్తిచేసిన 46 శాతం మందికి కూడా ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు లభించలేదని నివేదిక పేర్కొంది. పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలు లేకపోవడంతో పాటు ఉద్యోగ సంక్షోభం కూడా దీనికి కారణంగా నివేదిక అభిప్రాయపడింది.
దేశంలో నిరుద్యోగిత రేటు 7.2 శాతంగా ఉన్నట్టు మేథోసంస్థ సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సీఎంఐఈ) తన తాజా సూచీలో వెల్లడించింది. నిరుడు నమోదైన సగటు నిరుద్యోగిత రేటు 4.9 శాతంతో పోలిస్తే, ఇది 2.3 శాతం ఎక్కువగా ఉన్నట్టు ఆందోళన వ్యక్తం చేసింది. మరోవైపు, దేశంలో నిరుద్యోగిత రేటు అంతకంతకూ పెరిగిపోతున్నదని ఫోర్బ్స్ ఇండియా వెల్లడించింది. నిరుద్యోగం, ఉద్యోగ కల్పనలో క్షీణత దేశ ఆర్థికాభివృద్ధికి గొడ్డలిపెట్టుగా మారొచ్చని ఐఎల్వో, పీఎల్ఎఫ్ఎస్ సంస్థలు అభిప్రాయపడ్డాయి.
కార్మికులు, యువతలో నైపుణ్యాన్ని పెంపొందించే లక్ష్యంతో 2015లో మోదీ ప్రభుత్వం పీఎం కౌశల్ వికాస్ యోజన స్కీమ్‌ను కూడా తెరమీదకు తెచ్చింది. అదే ఏడాది ‘స్కిల్ ఇండియా మిషన్’ను కూడా ప్రారంభించింది. అయితే, ఈ కార్యక్రమాలన్నీ ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్, పీఎల్ఎస్ఎఫ్, ఐఎల్వో, అన్‌స్టాప్ సంస్థలు విడుదల చేసిన నివేదికలను విశ్లేషిస్తే ఇది నిజమేనని అంటున్నారు. మోదీ ప్రభు త్వం ఇప్పటికైనా యువత ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.