ముంబై: ముంబైలో సైబర్ క్రైం(Cyber Crime) ఘటన జరిగింది. 80 ఏళ్ల వృద్ధుడిని ఓ మహిళ దారుణంగా మోసం చేసింది. రెండున్నర ఏళ్లలో అతను 9 కోట్లు కోల్పోయాడు. ఆ సమయంలో 734 సార్లు ఆన్లైన్ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. ప్రేమ, నమ్మకంతో నటిస్తూ ఆ మహిళ మోసం చేసినట్లు తెలుస్తోంది. ఒకే ఒక్క మహిళ.. నాలుగురి పేర్లతో ఆ వృద్ధుడిని ట్రాప్ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు.
2023 ఏప్రిల్‌లో షార్వీ అనే మహిళలకు ఫేస్బుక్లో ఆ వృద్ధుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. కానీ ఆ రిక్వెస్ట్‌ను ఆ మహిళ తిరస్కరించింది. కొన్ని రోజుల తర్వాత షార్వీ అకౌంట్ నుంచి ఆ వృద్ధుడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. ఇక ఆ ఇద్దరూ ఫోన్ నెంబర్ల ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఫేస్బుక్ నుంచి వాట్సాప్‌లో చాటింగ్ మొదలుపెట్టారు. భర్తకు దూరంగా ఉంటున్నట్లు షార్వీ ఆ వృద్ధుడికి చెప్పింది. నెమ్మదిగా అతన్ని డబ్బులు అడిగింది. పిల్లలు ఆరోగ్యంగా లేరని చెబుతూ అతనికి టోకరా వేసింది.
కొన్ని రోజుల తర్వాత కవిత అనే మహిళ కూడా ఆ వృద్ధుడితో వాట్సాప్‌లో చాటింగ్ మొదలుపెట్టింది. షార్వీకి స్నేహితురాలిని అని చెప్పుకున్నదామె. ఫ్రెండ్ కావాలనుకుంటున్నట్లు పేర్కొన్నది. ఆ తర్వాత అసభ్యకరమైన మెసేజ్‌లను పంపించింది. ఆమె కూడా డబ్బులు అడగడం ప్రారంభించింది. ఆ ఏడాది డిసెంబర్లోనే దినాజ్ పేరుతో మరో మహిళ ఆ వృద్ధుడితో చాటింగ్ చేసింది. షార్వీ సోదరిని అని చెప్పుకున్నది. షార్వీ చనిపోయిందని, ఆస్పత్రి బిల్లు కట్టాలని ఆ వృద్ధుడిని డబ్బులు అడిగింది. షార్వీతో సంభాషించిన వాట్సాప్ చాటింగ్ స్క్రీన్షాట్లను పంపి దినాజ్ బెదిరింపులకు పాల్పడింది. ఆ వృద్ధుడి నుంచి డబ్బులు వసూల్ చేసింది.
డబ్బులు తిరిగి ఇవ్వాలని ఆ వ్యక్తి అడిగినప్పుడు, సూసైడ్ చేసుకోనున్నట్లు దినాజ్ బెదిరించింది. అయితే ఆ సమయంలోనే జాస్మిన్ అనే మరో మహిళ కూడా ఆ వృద్ధుడితో చాటింగ్ మొదలుపెట్టింది. దినాజ్ స్నేహితురాలిని అని ఆమె చెప్పింది. హెల్ప్ చేయాలని కోరగా ఆ వృద్ధుడు ఆమెకు డబ్బులు పంపాడు. ఏప్రిల్ 2023 నుంచి జనవరి 2025 వరకు ఆ వృద్ధుడు.. సుమారు 8.7 కోట్లు ట్రాన్స్ఫర్ చేశాడు. 734 సార్లు లావాదేవీలు నిర్వహించాడు. అతని దగ్గర ఉన్న మొత్తం డబ్బును పోగొట్టుకున్నాడు. ఆ తర్వాత ఆ వృద్ధుడు తన కోడలి దగ్గర 2 లక్షలు తీసుకుని మహిళకు చెల్లించాడు. మళ్లీ కొడుకు దగ్గర 5 లక్షలు తీసుకుని ఆ మహిళకు ట్రాన్స్ఫర్ చేశాడు.
అనుమానంతో తండ్రి గురించి కొడుకు ఆరా తీశాడు. అయితే సైబర్ ఫ్రాడ్ జరిగినట్లు తెలుసుకున్న వృద్ధుడు షాక్‌లోకి వెళ్లాడు. ప్రస్తుతం అతనికి చికిత్స చేయిస్తున్నారు. ఆ వృద్ధుడు మతిమరుపు వ్యాధితో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. జూలై 22వ తేదీన ఈ కేసులో సైబర్‌క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్న పోలీసులు.. కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు. ఒకే మహిళ నాలుగు రకాల పేర్లతో చాటింగ్ చేస్తూ ఆ వృద్ధుడిని మోసం చేసినట్లు గుర్తించామ్నారు.