న్యూఢిల్లీ, జూలై 5: పీజీ డెంటల్ విద్యార్థులు ఇకపై పరీక్షలకు హాజరుకావాలంటే 80శాతం బయోమెట్రిక్ హాజరు తప్పనిసరిగా ఉండాల్సిందే. జాతీయ దంత వైద్య కమిషన్(ఎన్డీసీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని డెంటల్ కాలేజీలు, వర్సిటీలకు ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది. విద్యార్థుల హాజరు విషయంలో విద్యాసంస్థలు జవాబుదారీగా ఉండాలని హెచ్చరించింది. పలు రాష్ర్టాల్లో తక్కువ హాజరుపై వచ్చిన ఫిర్యాదుల నేపథ్యంలో ఈ ఏడాది జనవరి 19న ఉత్తర్వులకు కొనసాగింపుగా తాజాగా ఆదేశాలు వెలువరించింది.
తగినంత బయోమెట్రిక్ హాజరులేని విద్యార్థులను పరీక్షలకు అనుమతిస్తే, ఆయా విద్యాసంస్థలే బాధ్యత వహించాల్సి ఉంటుందని కూడా కమిషన్ హెచ్చరించింది. ‘80శాతం కంటే తక్కువగా ఉన్న ఏ పీజీ విద్యార్థి కూడా వర్సిటీ లేదా పీజీ పరీక్షకు హాజరుకాకుండా చూడాలి. ఎన్డీసీ జారీచేసిన ఆదేశాలను పాటించని పక్షంలో చర్యలు తప్పవు’ అని పేర్కొన్నది. రాజస్థాన్, హర్యానా, ఉత్తరప్రదేశ్లోని కాలేజీల్లో పీజీ డెంటల్ విద్యార్థుల హాజరు సరిపోవడం లేదనే ఫిర్యాదులను పరిశీలించిన గ్రీవెన్స్ సబ్ కమిటీ సిఫార్సులతో మునుపటి సర్క్యులర్నే ఎన్డీసీ మళ్లీ జారీచేసింది.