హైదరాబాద్ : బంజారాహిల్స్‌లోని నందమూరి బసవతారక రామారావు ( Basavatarakam Hospital ) మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ తీరుపై తెలంగాణ హైకోర్టు ( High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. పిటిషనర్ చికిత్సలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా హాస్పిటల్‌పై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగి ట్రీట్మెంట్ ఆరోగ్యశ్రీ పథకం కిందికి రాదని, ఖర్చులన్నీ ఆమెనే భరించాలని బసవతారకం హాస్పిటల్ సిబ్బంది స్పష్టం చేసింది.
దీంతో ఆమె బసవతారకం హాస్పిటల్‌పై హైకోర్టులో పిటిషన్ వేసింది. కేసును విచారించిన హైకోర్టు ఆసుపత్రిపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ సబ్సిడీలు పొందిన ప్రైవేట్ హాస్పిటల్స్ పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని సూచించింది. సుమారు 7.35 ఎకరాల ప్రభుత్వ భూమిని సబ్సిడీపై పొందిన బసవ తారకం హాస్పిటల్ పేదలకు ఉచితంగా వైద్యం చేయాలని వెల్లడించింది. పిటిషనర్ చికిత్సలో ఏ మాత్రం ఆలస్యం జరిగినా హాస్పిటల్‌పై తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించి, ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చుకుని అవసరమైన అన్ని చికిత్సలను అందించాలని హైకోర్టు ఆదేశించింది.