గ్యాంగ్టక్: మైనర్ బాలికపై ఏడాదిగా అత్యాచారం జరిగింది. (girl raped for months) దీంతో ఆమె ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడేది. క్లాస్లో మౌనంగా ఉండేది. గమనించిన టీచర్ ఆ బాలికను ఆరా తీయడంతో ఈ దారుణం గురించి బయటపెట్టింది. దీంతో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఫిర్యాదుతో నలుగురు బాలురతో సహా 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సిక్కింలోని గ్యాల్షింగ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 13 ఏళ్ల బాలికను పనుల్లో సహాయం పేరుతో స్థానిక మహిళ నిత్యం తన ఇంటికి తీసుకెళ్లేది. ఆ బాలికను బలవంతంగా వ్యభిచారంలోకి దింపింది. మహిళ భర్త, మరో ఇద్దరు వ్యక్తులతో పాటు నలుగురు బాలురు ఏడాదిగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
కాగా, బాధిత బాలిక ఎప్పుడూ అనారోగ్యంతో ఉండటాన్ని స్కూల్ టీచర్ గమనించింది. అలాగే ఆమె ఎవరితో మాట్లాడకుండా క్లాస్లో మౌనంగా ఉండటాన్ని పరిశీలించింది. దీంతో ఏం జరిగిందని ఆ బాలికను ఆరా తీసింది. ఏడాదిగా తనపై లైంగిక దాడులు జరుగుతున్నట్లు ఆమె చెప్పింది. ఈ నేపథ్యంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి ఆ స్కూల్ సమాచారం ఇచ్చింది. ఏప్రిల్ 11న పోలీసులకు ఆ సంస్థ ఫిర్యాదు చేసింది.
మరోవైపు పోలీసులు వెంటనే స్పందించారు. మహిళ, ఆమె భర్త, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. నలుగురు మైనర్ బాలురను అదుపులోకి తీసుకున్నారు. పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వద్ద ఉన్న బాధిత బాలికకు చికిత్సతోపాటు కౌన్సెలింగ్ ఇస్తున్నారు.