పనాజీ, సెప్టెంబర్ 14: గోవాలో బీజేపీ ప్రలోభాల పర్వం కొనసాగుతున్నది. మాజీ ముఖ్యమంత్రి దిగంబర్ కామత్ సహా కాంగ్రెస్‌కు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలను బీజేపీ తమవైపు తిప్పుకున్నది. వీరి ఫిరాయింపుతో మొత్తం 40 స్థానాలున్న గోవా శాసనసభలో ప్రస్తుతం కాంగ్రెస్‌కు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు. బీజేపీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల తీరుపై కాంగ్రెస్ మండిపడింది.
అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక ప్రజల పట్ల, పార్టీ పట్ల విధేయతతో ఉంటామని ఒట్టేసిన ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఆ ఒట్టును తీసి గట్టుమీద పెట్టడం వారి నమ్మకద్రోహానికి, సిగ్గులేనితనానికి నిలువెత్తు నిదర్శనమని ధ్వజమెత్తింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఈ ఏడాది జనవరిలో గుడి, చర్చి, దర్గాలో వేసిన ఈ ఒట్టు గురించి ఇప్పుడు కామత్‌ను ప్రశ్నించగా.. ‘నేను మళ్లీ దేవాలయానికి వెళ్లి ఏమి చేయాలో చెప్పమని దేవుడిని అడిగా. ఏది మంచిదైతే అది చేయమని దేవుడు నాతో చెప్పాడు’ అంటూ సమాధానమిచ్చారు. బీజేపీ తీరుపైనా కాంగ్రెస్ ధ్వజమెత్తింది. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తుందన్న భయంతోనే ఎమ్మెల్యేలను కొనేసిందని ఆరోపించింది. సంతలో పశువులను కొన్నట్టు ఎమ్మెల్యేలను కొంటున్నదని బీజేపీపై గోవా ఫార్వర్డ్ పార్టీ మండిపడింది.