(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ): కొవిడ్-19 మహమ్మారితో అతలాకుతలమైన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో, పెరిగిన నిరుద్యోగం, ద్రవ్యోల్బణం లాంటి పరిస్థితులను ఎదుర్కోవటంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దేశంలో గత 11 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా చిన్న పొదుపు పథకాలకు నిధులు తగ్గడమే అందుకు నిదర్శనం. గత ఏడాదితో పోలిస్తే జాతీయ పొదుపు పథకాలలో పొదుపు నిధులు 8.5 శాతం తగ్గాయి.
2022 ఆర్థిక సంవత్సరం స్మాల్ సేవింగ్ డిపాజిట్లు రూ.3.33 లక్షల కోట్లు ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో అవి రూ.3.04 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. అయితే కేంద్ర ప్రభుత్వం పొదుపు పథకాలకు వడ్డీ రేటును తగ్గించటం, దీర్ఘకాలం పెంచకపోవడమే పొదుపు తగ్గడానికి ముఖ్య కారణాలుగా ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంతకాలం కింద వడ్డీ రేట్లను కేంద్ర ప్రభుత్వం కొంత పెంచుతున్నట్లు ప్రకటించినా.. ప్రజల్లో కేంద్ర ప్రభుత్వ విధానాల అమలు పట్ల విశ్వాసం సన్నగిల్లడమే కారణమన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2023 ఆర్థిక సంవత్సరంలో చిన్న పొదుపు పథకాల కింద అత్యధిక క్షీణత నమోదైన రాష్ర్టాల్లో గుజరాత్, మహారాష్ట్ర, ఢిల్లీ, పంజాబ్, పశ్చిమబెంగాల్ ఉన్నాయి.