(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ఒడిశాలో మూడు రైళ్లు ఢీ కొని వందలాది మంది దుర్మరణం చెందడం భారతీయ రైల్వేలోని నిర్వహణ లోపాలను తేటతెల్లం చేసింది. రైల్వే ప్రమాదాలకూ సిబ్బంది కొరత కూడా ఒక ముఖ్య కారణమన్న విషయాన్నీ బయటపెట్టింది. గత డిసెంబర్ వరకు రైల్వేలో సిగ్నలింగ్, టెలికాం, ట్రాఫిక్, రవాణా విభాగాల్లో 77 వేల ఖాళీలున్నాయి. ఇతర విభాగాలన్నింటిలో కలిపితే మొత్తం 3.12 లక్షలకు పైగా ఖాళీలున్నాయి. జోన్ల వారీగా చూస్తే…ఉత్తర రైల్వే జోన్లో అత్యధికంగా 39,226; పశ్చిమ రైల్వే జోన్లో 30,785; తూర్పు రైల్వే జోన్లో 30,735; మధ్య రైల్వే జోన్లో 28,876 ఖాళీలున్నాయి. ఏడాదిలోగా 1,35,000 ఖాళీలు భర్తీ చేస్తామని రైల్వే మంత్రి పార్లమెంట్ సాక్షిగా ప్రకటించినా.. అది అమలు కాలేదు. ఈ నేపథ్యంలో వ్యవస్థలోని లోటుపాట్లపై శ్రధ్ధ పెట్టకుండా.. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయకుండా ప్రైవేటు సంస్థలకు పలు ముఖ్య సేవలు కట్టబెట్టిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో ఆటలాడుతున్నదని రైల్వే రంగ నిపుణులు విమర్శిస్తున్నారు.